Virat Kohli 50th ODI Century: నేడు విరాట్‌కి ప్రత్యేకమైన రోజు.. బీసీసీఐ ప్రత్యేక పోస్టు!
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:34 AM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈరోజు(నవంబర్ 15) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అతడు 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియం వేదికగా వన్డేల్లో తన 50వ సెంచరీ నమోదు చేశాడు. అతడు ఈ ఘనతను వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సాధించాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకుని కింగ్ అనిపించుకున్నాడు. టీమిండియాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో... అదే స్థాయిలో విరాట్ కోహ్లీ ఒక్కడికే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇండియా మ్యాచ్ కంటే.. మైదానంలోకి కోహ్లీ వస్తున్నాడంటే చూడటానికి వెళ్లే క్రికెట్ అభిమానులే ఎక్కువ. ఇంతలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ విరాట్ సంపాదించడానికి కారణం.. ఆటపై అతడికి ఉన్న నిబద్ధత, కసి, పట్టుదల. ఓడిపోయే ఎన్నో మ్యాచులను ఒంటి చెత్తో విరాట్ గెలిపించాడు. ఇక క్రికెట్ ప్రపంచం(Cricket World)లో విరాట్ అనేక రికార్డులను తిరగరాశాడు. అంతేకాక తాను క్రియేట్ చేసిన కొన్ని రికార్డులను ఎవరు టచ్ చేయలేని స్థితి లో కింగ్ ఉన్నాడు. అలాంటి ఓ రికార్డును సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు విరాట్ క్రియేట్ చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈరోజు(నవంబర్ 15) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అతడు 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియం వేదికగా వన్డేల్లో తన 50వ సెంచరీ నమోదు చేశాడు. అతడు ఈ ఘనతను వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సాధించాడు. ఈ సెంచరీతో కోహ్లీ.. అప్పటివరకు అత్యధిక శతకాలు చేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(49) (Sachin Tendulkar) రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
49వ సెంచరీని సచిన్ 451 వన్డే ఇన్నింగ్స్‌ల్లో సాధిస్తే.. విరాట్ 277 ఇన్నింగ్స్ లో అందుకున్నాడు. విరాట్ తన 49వ సెంచరీని వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా మీద నమోదు చేయగా.. కేవలం ఒక ఇన్నింగ్స్ గ్యాప్‌లోనే 279వ ఇన్నింగ్స్‌లో 50వ సెంచరీని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో మైదానం నుంచి సచిన్ సైతం ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం. విరాట్ తన రికార్డ్‌ను బద్దలు కొడుతుంటే.. సచిన్ టెండూల్కర్ ప్రత్యక్షంగా చూస్తూ.. అతన్ని అభినందించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 51 సెంచరీలు (293 ఇన్నింగ్స్‌లు)లతో కొనసాగుతున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ రికార్డు క్రియేట్ చేసిన ఈ రోజును గుర్తు చేసుకుంటూ బీసీసీఐ(BCCI) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. దీనికి విరాట్ ఫ్యాన్స్, క్రికెట్ అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అంతేకాక మరోసారి కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇక విరాట్‌కోహ్లీ క్రికెట్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఆయన టీ20, టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జట్టులోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచుల్లో వరుస డకౌట్లు అయినప్పటికీ మూడో వన్డే మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీతో (74*) ఫామ్‌లోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచుల్లో విరాట్ డకౌట్ అయినప్పటికీ పెవిలినయ్ చేరే క్రమంలో ప్రేక్షకులు.. 'కింగ్.. కింగ్' అంటూ కేకలు వేశారు. దీంతో విరాట్ కాసేపు భావోద్వేగానికి గురయ్యాడు.