Sreesanth Wife: చెంపదెబ్బ వీడియో రిలీజ్.. లలిత్ మోదీపై శ్రీశాంత్ భార్య ఆగ్రహం
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:01 PM
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన వీడియోను మళ్లీ రిలీజ్ చేసినందుకు లలిత్ మోదీ, మైఖ్లార్క్‌పై శ్రీశాంత్ భార్య ఫైరైపోయారు. ఇది అమానవీయం, కర్కశం అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన తాలూకు వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇటీవల షేర్ చేసిన విషయం తెలిసింది. జనాలు మర్చిపోతున్న ఈ ఘటనను లలిత్ మోదీ మరోసారి గుర్తు చేయడంతో ఈ అంశం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మునుపెన్నడూ చూడని వీడియోను లలిత్ మోదీ షేర్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్ సందర్భంగా ఈ వీడియోను పంచుకున్నారు.
ఈ ఉదంతంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి మండిపడ్డారు. పాత గాయాలను మళ్లీ రేపుతున్నారంటూ లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్‌పై మండిపడ్డారు. ‘ఇలాంటి పని చేసినందుకు లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ సిగ్గు పడాలి. మీ పబ్లిసిటీ కోసం 2008 నాటి ఘటనను తవ్వితీస్తారా. శ్రీశాంత్, హర్భజన్ ఇద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడో వదిలేశారు. తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. వాళ్లు ఇద్దరికీ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. కానీ మీరు పాత గాయాన్ని మళ్లీ రేపే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా అమానవీయం, కర్కశం’ అని ఫైరైపోయారు.
ఈ విషయమై ఆమె మరో పోస్టులో స్పందిస్తూ.. పాత వీడియో మళ్లీ బయటకు రావడం తమ కుటుంబాలను గాయపరిచిందని అన్నారు. ఏ తప్పు చేయని వారి పిల్లలపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే ఈ వీడియోను బయటపెట్టినందుకు ఇద్దరిపైనా కేసులు పెట్టాలని అభిప్రాయపడ్డారు.
నాటి ఘటన బ్రాడ్ కాస్ట్ కెమెరాకు చిక్కలేదని మైఖేల్ క్లార్క్ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ తెలిపారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డు అయ్యిందన్నారు. నాటి వీడియోను తాను డిలీట్ చేయలేదని చెప్పారు. శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నందుకు హర్భజన్‌సింగ్‌పై ఎనిమిది మ్యాచ్‌ల పాటు నిషేధం విధించినట్టు కూడా తెలిపారు. ఈ ఉదంతంపై హర్భజన్ సింగ్ ఇప్పటికే పలు బహిరంగ వేదికలపై శ్రీశాంత్‌కు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి