Share News

IPL Auction: ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..

ABN , Publish Date - Nov 11 , 2025 | 09:20 PM

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ వేలం ఎప్పుడు ఎక్కడ జరిగేదీ ఖరారైపోయింది. ఈసారి కూడా వేలాన్ని విదేశాల్లో నిర్వహించనున్నారు. మరి వేలం ఏ దేశంలో, ఎప్పుడు నిర్వహిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.

IPL Auction: ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
IPL 2026 mini auction

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మినీ వేలానికి తేదీ, వేదిక ఖరారయ్యాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈసారి అబుదాబిలో ఐపీఎల్ ఆక్షన్-2026ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 15 లేదా 16న వేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది. అయితే, తేదీ మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా ఖరారు కాలేదు. ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించడం వరుసగా ఇది మూడో సారి. గతంలో దుబాయ్(2023), జెద్దాలో(2024) వేలాన్ని నిర్వహించారు. ఈసారి అబుదాబిని వెన్యూగా ఎంచుకున్నామని అధికారి ఒకరు తెలిపారు (IPL Auction Date Venue).

గతేడాది మెగా వేలం జరిగిన నేపథ్యంలో ఈసారి మినీ వేలాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసింది. మెగా వేలం తరువాత చిన్న చిన్న మార్పులు చేర్పులతో జట్టు కూర్పునకు మెరుగులు దిద్దుకునేందుకు ఫ్రాంచైజీలకు మినీ వేలంలో అవకాశం ఉంటుంది. ప్రాంఛైజీలు తమ వద్ద మిగిలిన డబ్బుతో పాలు ఆటగాళ్ల విడుదలతో మిగిలే డబ్బుతో జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేస్తాయి.


ఈసారి వేలానికి తొలుత డిసెంబర్ 14న నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ ఫ్రాంజైజీలు గవర్నింగ్ కౌన్సిల్‌కు ఈ డేట్‌ను ఇచ్చినట్టు సమాచారం. అయితే, డిసెంబర్ 15న లేదా 16న నిర్వహించాలని చివరకు నిర్ణయించారు. వాస్తవానికి ఈసారి ఆక్షన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని తొలుత అనుకున్నారు. ముంబై లేదా బెంగళూరు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, నవంబర్‌లో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుండటంతో చివరకు అబుదాబిని ఎంచుకున్నారు. కామెంటేటర్లు, అనలిస్టులు, కోచ్‌లు వంటి విదేశీ సపోర్టు సిబ్బందిలో అనేక మంది యాషెస్‌లో కూడా పాలుపంచుకుంటున్న నేపథ్యంలో అందరికీ అనుకూలంగా అబుదాబి ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు.

ఇక తాము రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు, వదులుకునే ప్లేయర్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాలని బీసీసీఐ ఫ్రాంఛైజీలకు డెడ్‌లైన్ విధించింది. ఈ లోపు ఫ్రాంచైజీల్లో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కొందరు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. సంజూ శామన్స్‌ను ట్రేడ్ చేసేందుకు ఆర్ఆర్ ఇప్పటికే పలు ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్టు సమాచారం. సంజూ సీఎస్‌కేకు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక వాషింగ్టన్ సుందర్‌ కూడా సీఎస్‌కే మళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై సంబంధిత టీమ్స్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.


ఇవి కూడా చదవండి

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 09:21 PM