Smriti Mandhana: స్మృతి మంధాన మళ్లీ ఆ పొరపాటు చేయకూడదు: మాజీ క్రికెటర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:23 PM
కేవలం 66 బంతుల్లోనే 80 పరుగులు చేసిన స్మృతి అనవసర షాట్ ఆడి తన వికెట్ కోల్పోయింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(ICC Womens World Cup) తుది అంకానికి చేరుకుంది. దీంట్లో భాగంగా అక్టోబర్ 30(గురువారం)న టీమిండియా(Team India) నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. అయితే ఈ టోర్నీలో ఇంతకు ముందు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ అలిస్సా హేలీ 142 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో టీమిండియా నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది. దీంటో ఆ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.
అయితే ఆ మ్యాచ్‌లో స్మృతి మంధాన(Smriti Mandhana) 80 పరుగులు చేసినప్పటికీ ఆ నాక్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం 66 బంతుల్లోనే 80 పరుగులు చేసిన స్మృతి అనవసర షాట్ ఆడి తన వికెట్ కోల్పోయింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడారు. ‘ఆసీస్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన 80 పరుగులు చేసి ఔటైంది. తాను వికెట్ కోల్పోయింది అనడం కంటే.. తన వికెట్ తానే సమర్పించుకుంది అనడం సబబు. ఆమె మరోసారి అలాంటి పొరపాటును రిపీట్ చేయకూడదు. ప్రపంచ కప్‌నకు ముందు ఆసీస్‌తో మూడు వన్డేల్లో ఆమె ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ స్థానానికి చేరుకోవడానికి ఆమె చాలా కృషి చేసింది. కాబట్టి స్మృతి దాన్ని కొనసాగిస్తూ సెమీ ఫైనల్‌లో రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని అంజుమ్ వ్యాఖ్యానించారు.
బాధ్యతంతా స్మృతిదే..!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ ప్రతీక రావల్ బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. చీలమండ గాయం కారణంగా ప్రపంచ కప్‌నకు దూరమైంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్‌లో స్మృతి మంధానపైనే మరింత బాధ్యత పెరిగింది. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్మృతినే టాప్ స్కోరర్. కేవలం ఏడు మ్యాచ్‌ల్లో దాదాపు 102 స్ట్రైక్ రేట్‌తో 365 పరుగులు సాధించింది. ప్రపంచ కప్ కంటే ముందు ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 300 పరుగులు చేసింది. అందులో ఓ అద్భుత సెంచరీ కూడా ఉంది.
Also Read:
ఇందుకే సింహాన్ని మృగరాజు అంటారు.. మొసలిని చూసి ఏం చేసిందో చూడండి..
రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన