Share News

Shreyas Iyer: అయ్యర్ కోలుకునేదెప్పుడో..!

ABN , Publish Date - Oct 28 , 2025 | 05:22 PM

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి గాయమైంది. అయ్యర్ గాయం చాలా సున్నితమైంది కావడంతో ఇప్పుడప్పుడే మైదానంలోకి దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

Shreyas Iyer: అయ్యర్ కోలుకునేదెప్పుడో..!
Shreyas Iyer

శ్రేయస్ ఎప్పుడు కోలుకుంటాడో..! ప్రతి అభిమాని మదిలో మెదిలే వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది. అంతర్గత రక్తస్రావం.. ఐసీయూలో చికిత్స.. వంటి వార్తలు వస్తున్నప్పటి నుంచి అటు అతడి తల్లిదండ్రులే కాదు.. ప్రతి క్రికెట్ అభిమాని సైతం ఆందోళన చెందుతున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో మంచి ఫామ్ అందుకుని సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్న అయ్యర్ ఒక్కసారిగా మైదానం వీడటంతో పరిస్థితి తలకిందులైంది.

సిడ్నీ(Sydney) వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer Injury) ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి(spleen injury) గాయమైంది. సిడ్నీలోనే ప్రస్తుతం అయ్యర్ చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ(BCCI) సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. అయితే అయ్యర్ గాయం చాలా సున్నితమైంది కావడంతో ఇప్పుడప్పుడే మైదానంలోకి దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.


అది చాలా కీలక సమయం..

ప్లీహం అనేది పిడికిలి పరిమాణంలో ఉండే మృదువైన అవయవం. ఎడమ వైపున పక్కటెముకల కింద ఉంటుంది. ప్లీహానికి చిన్న గాయమైతే.. అది తనంతటతానే మరమ్మతు చేసుకుంటుంది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది. ప్లీహానికి గాయమైన తర్వాత తొలి 24 నుంచి 48 గంటలు చాలా కీలకం. ఈ దశ తర్వాత వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే.. డాక్టర్లు వారిని కదలడానికి, ఆహారం తీసుకోవడానికి అనుమతిస్తారు. రక్తస్రావం నియంత్రణలోకి వచ్చాక వారం పాటు ఆసుపత్రిలోనే ఉంచి ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. కానీ వారు సాధారణ జీవితంలోకి రావడానికి మాత్రం కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ప్లీహానికైన గాయం పూర్తిగా మానాలంటే 6 నుంచి 12 వారాలు పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్లీ అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.


మూడు నెలలు ఆగాల్సిందే..!

శ్రేయస్ గాయానికి గురైన వెంటనే ఫిజియోలు త్వరగా స్పందించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో అయ్యర్‌కు ప్రాణాపాయం తప్పింది. ఓ రకంగా శ్రేయస్ అదృష్టవంతుడు. ప్లీహానికి చిన్న గాయమైతే చాలా తక్కువ సమయంలో కోలుకుంటారు. అయ్యర్ శారీరకంగా ఫిట్‌గా ఉంటాడు కాబట్టి అనుకున్న సమయం కంటే త్వరగానే కోలుకునే అవకాశం ఉంది. అయితే అతడు ఇప్పుడిప్పుడే మైదానంలోకి మాత్రం రాలేడు. శ్రేయాస్ మళ్లీ బ్యాట్ పట్టాలంటే దాదాపు మూడు నెలల వరకు ఆగాల్సిందే! ఈ నేపథ్యంలో అయ్యర్ త్వరగా కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలని టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ, అభిమానులు కోరుకుంటున్నారు.


Also Read:

పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. అత్యాధునిక హంగులతో..

మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు.. సూసైడ్‌కు ముందు చాటింగ్

Updated Date - Oct 28 , 2025 | 05:38 PM