Shreyas Iyer: అయ్యర్‌కు సర్జరీ జరగలేదు: సైకియా
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:13 PM
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి గాయమై అంతర్గతంగా రక్తస్రావం అయింది. దీంతో అయ్యర్‌ను ఐసీయూలో చేర్చారని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ(BCCI) మాత్రం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించింది. శ్రేయస్‌కు సర్జరీ జరిగిందని, కనీసం ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) మరోసారి స్పందించారు.
‘శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా చూశారు. డాక్టర్ రిజ్వాన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నా. సిడ్నీ ఆసుపత్రిలోనే టీమిండియా వైద్యుడు కూడా ఉన్నారు. అయ్యర్ పూర్తిగా కోలుకుని రావడానికి కనీసం ఎనిమిది వారాలు పడుతుందని అనుకుంటున్నాం. కానీ అతడి తీరు చూస్తే ఇంకాస్త ముందుగానే కోలుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైద్యులు కూడా శ్రేయస్ పరిస్థితి మెరుగుదలపై సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే అతడు తన రోజువారీ కార్యక్రమాలను చేసుకుంటున్నాడు. అతడి గాయం తీవ్రమైందే కావచ్చు కానీ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డాడు. ఇప్పటికే ఐసీయూ నుంచి అతడిని సాధారణ రూమ్‌కు మార్చారు’ అని సైకియా తెలిపారు.
అవన్నీ అవాస్తవాలు..
‘చాలా సోషల్ మీడియా ఛానళ్లలో శ్రేయస్‌కు సర్జరీ జరిగిందని వార్తలు వస్తున్నాయి. కానీ అతడికి ఎలాంటి సర్జరీ జరగలేదు. బయట వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. అతడి ప్లీహంలో అంతర్గత రక్తస్రావం ఆపేందుకు భిన్నమైన వైద్య ప్రక్రియను చేపట్టారు. అందుకే చాలా త్వరగా రికవరీ అవుతున్నాడు. ఇలాంటి గాయాలు ఉన్నప్పుడు కనీసం వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. వేగంగా కోలుకుంటున్నప్పటికీ శ్రేయస్ కూడా ఆసుపత్రిలోనే ఉంటాడు’ అని సైకియా స్పష్టం చేశాడు. కాగా అయ్యర్ కుటుంబసభ్యులు ఇప్పటికే ఆస్ట్రేలియాకు పయనమైన విషయం తెలిసిందే.