Share News

రోహిట్‌ అయ్యాడోచ్‌!

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:41 AM

రోహిత్‌ శర్మ శతకంతో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. తద్వారా 2-0తో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీ్‌సను కూడా ఖాతాలో వేసుకుంది. ఆఖరిదైన మూడో వన్డే బుధవారం అహ్మదాబాద్‌లో...

రోహిట్‌ అయ్యాడోచ్‌!

76 బంతుల్లో శతకం

  • గిల్‌ హాఫ్‌ సెంచరీ

  • 2-0తో భారత్‌దే సిరీస్‌

  • రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌ ఓటమి

ఆహా.. ఈ ఆట కోసమే కదా భారత క్రికెట్‌ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. ఫామ్‌లో లేడు.. వయసు మీరుతోంది.. జట్టులో అవసరమా? అనే విమర్శలను తిప్పికొడుతూ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్‌ కమ్‌బ్యాక్‌ అయ్యాడు. బౌలర్లను తుత్తునియలు చేస్తూ ఫ్లిక్‌, పుల్‌, కవర్‌డ్రైవ్‌, లాఫ్డెడ్‌ ఆఫ్‌ డ్రైవ్స్‌, స్వీప్‌.. ఇలా అన్ని రకాల షాట్లతో ఫ్యాన్స్‌కు విందు భోజనమే అందించాడు. ఆఖరి పది ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కదాంట్లోనైనా 20 పరుగులైనా సాధించని రోహిత్‌ శర్మ (90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119) కటక్‌లో గర్జించాడు. తాను క్రీజులో కుదురుకుంటే ఎంత ప్రమాదకరమో ఎటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థికి రుచి చూపిస్తూ.. 16 నెలల తర్వాత సెంచరీతో మురిపించాడు. రో‘హిట్‌’తో రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌ను భారత్‌ చిత్తుచేసింది. మరో మ్యాచ్‌ ఉండగానే మూడు వన్డేల సిరీ్‌సను కైవసం చేసుకుంది.


కటక్‌: రోహిత్‌ శర్మ శతకంతో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. తద్వారా 2-0తో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీ్‌సను కూడా ఖాతాలో వేసుకుంది. ఆఖరిదైన మూడో వన్డే బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (69), బెన్‌ డకెట్‌ (65), లివింగ్‌స్టోన్‌ (41), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (34), బ్రూక్‌ (31) కలిసికట్టుగా రాణించారు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో భారత్‌ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (60), శ్రేయాస్‌ అయ్యర్‌ (44), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. ఒవర్టన్‌కు రెండు వికెట్లు లభించాయి. సెంచరీ హీరో రోహిత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


కెప్టెన్‌ జోరు: భారీ ఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను యధేచ్ఛగా ఆడేసుకున్నారు. పిచ్‌ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం అందకపోవడంతో భారత్‌కు అలవోకగా పరుగులు సమకూరాయి. ముఖ్యంగా రోహిత్‌ రెండో ఓవర్‌లో వరుసగా 4,6తో స్టేడియంలో ఫుల్‌ జోష్‌ను నింపాడు. ఇక అతను కుదురుకున్నట్టే అని ఫ్యాన్స్‌ అంతా సంబరపడ్డారు. వారిని ఏ మాత్రం నిరాశకు గురి చేయకుండా రోహిత్‌ ఆ తర్వాత కవర్‌డ్రైవ్‌తో, ఫ్లిక్‌ షాట్‌తో సంధించిన సిక్సర్లు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ దశలో ఏడో ఓవర్‌లో ఓ ఫ్లడ్‌లైట్‌ మొరాయించడంతో అరగంట పాటు ఆట ఆగిపోయింది. మ్యాచ్‌ మొదలైన తర్వాత కూడా రోహిత్‌ జోరు తగ్గలేదు. వరుస బౌండరీలతో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు 15వ ఓవర్‌లో రెండు ఫోర్లతో గిల్‌ కూడా 45 బంతుల్లో ఈ ఫిఫ్టీ సాధించాడు. కానీ ఒవర్టన్‌ అతడిని సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు విరాట్‌ కోహ్లీ (5) నిరాశపరుస్తూ రషీద్‌ ఓవర్‌లో అవుటయ్యాడు. అటు శతకానికి దగ్గరగా వచ్చిన రోహిత్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. 26వ ఓవర్‌లో ముందుకు వచ్చి మరీ లాంగా్‌ఫలో బాదిన సిక్సర్‌తో రోహిత్‌ కెరీర్‌లో 32వ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ వెంటనే రెండు వరుస ఫోర్లతో 15 రన్స్‌ సమకూరాయి. అటు శ్రేయాస్‌ సైతం చెలరేగి ఉడ్‌ ఓవర్‌లో 4,4,6తో 17 రన్స్‌ రాబట్టాడు. సెంచరీ తర్వాత కాస్త అలసిపోయినట్టు కనిపించిన రోహిత్‌ ఓ ఫుల్‌టాస్‌ బంతికి రషీద్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికే పటిష్ట స్థితికి చేరిన భారత్‌కు శ్రేయా్‌స-అక్షర్‌ జోడీ నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించింది. చక్కగా కుదురుకున్న శ్రేయాస్‌ సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే కేఎల్‌ రాహుల్‌ (10), హార్దిక్‌ పాండ్యా (10) అవుటయ్యారు. కానీ లక్ష్యం 48 బంతుల్లో 19 పరుగులే ఉండడంతో అక్షర్‌, జడేజా (11 నాటౌట్‌) 45వ ఓవర్‌లో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.


కలిసికట్టుగా: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఈసారి నిలకడ చూపారు. టాప్‌-6 బ్యాటర్ల సమష్టి రాణింపుతో జట్టు స్కోరు 300 దాటగలిగింది. అయితే ఆరంభంలో చూపిన జోరు మధ్య ఓవర్లలో కాస్త తగ్గింది. ఓపెనర్లు డకెట్‌, సాల్ట్‌ (26) తొలి పవర్‌ప్లేలో వేగంగా ఆడడంతో 75 పరుగులు వచ్చాయి. అయితే 11వ ఓవర్‌లో సాల్ట్‌ను స్పిన్నర్‌ వరుణ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు హాఫ్‌ సెంచరీతో ఊపు మీదున్న డకెట్‌ను జడేజా తన తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. అనంతరం రూట్‌, బ్రూక్‌ జోడీ భారత్‌ను విసిగిస్తూ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. బ్రూక్‌ వెనుదిరిగాక రూట్‌కు బట్లర్‌ జత కలిశాడు. ఇద్దరూ నిలకడను ప్రదర్శించడంతో 320+ స్కోరు కూడా సాధ్యమేననిపించింది. ఇదే జోరులో రూట్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ 39వ ఓవర్‌లో బట్లర్‌ను హార్దిక్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే జడేజా వరుస ఓవర్లలో కీలక రూట్‌తో పాటు ఒవర్టన్‌ (6)ను వెనక్కి పంపడంతో జట్టు 258 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పటికి మరో ఐదు ఓవర్లే ఉండడంతో స్కోరు 300 దాటదనిపించింది. అయితే లివింగ్‌స్టోన్‌, రషీద్‌ (14) ఆఖరి నాలుగు ఓవర్లలోనే 43 రన్స్‌ రాబట్టి ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు కారణమయ్యారు.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌: సాల్ట్‌ (సి) జడేజా (బి) వరుణ్‌ 26; డకెట్‌ (సి) హార్దిక్‌ (బి) జడేజా 65; రూట్‌ (సి) విరాట్‌ (బి) జడేజా 69; బ్రూక్‌ (సి) గిల్‌ (బి) రాణా 31; బట్లర్‌ (సి) గిల్‌ (బి) హార్దిక్‌ 34; లివింగ్‌స్టోన్‌ (రనౌట్‌) 41; ఒవర్టన్‌ (సి) గిల్‌ (బి) జడేజా 6; అట్కిన్సన్‌ (సి) కోహ్లీ (బి) షమి 3; రషీద్‌ (రనౌట్‌) 14; ఉడ్‌ (రనౌట్‌) 0; సకీబ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 49.5 ఓవర్లలో 304 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-81, 2-102, 3-168, 4-219, 5-248, 6-258, 7-272, 8-297, 9-304, 10-304. బౌలింగ్‌: షమి 7.5-0-66-1; హర్షిత్‌ రాణా 9-0-62-1; హార్దిక్‌ 7-0-53-1; వరుణ్‌ 10-0-54-1; జడేజా 10-1-35-3; అక్షర్‌ 6-0-32-0.

భారత్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 119; గిల్‌ (బి) ఒవర్టన్‌ 60; విరాట్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 5; శ్రేయాస్‌ (రనౌట్‌) 44; అక్షర్‌ (నాటౌట్‌) 41; రాహుల్‌ (సి) సాల్ట్‌ (బి) ఒవర్టన్‌ 10; హార్దిక్‌ (సి) ఒవర్టన్‌ (బి) అట్కిన్సన్‌ 10; జడేజా (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 44.3 ఓవర్లలో 308/6. వికెట్ల పతనం: 1-136, 2-150, 3-220, 4-258, 5-275, 6-286. బౌలింగ్‌: సకీబ్‌ 6-0-36-0; అట్కిన్సన్‌ 7-0-65-1; ఉడ్‌ 8-0-57-0; రషీద్‌ 10-0-78-1; ఒవర్టన్‌ 5-0-27-2; లివింగ్‌స్టోన్‌ 7-0-29-1; రూట్‌ 1.3-0-15-0.


ఒక్క ఇన్నింగ్స్‌తో..

ఎన్ని విమర్శలు..ఎంతటి అవమానం! కెప్టెన్‌గా ఉండీ టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి. టీ20 కెరీర్‌ ముగిసింది. ఇక టెస్ట్‌ల నుంచీ రిటైర్‌ కావడమే ఉత్తమం అన్న సూచనలు. ఇటీవలి కాలంలో ఏ భారత స్టార్‌ క్రికెటర్‌కూ ఇంతటి గడ్డు పరిస్థితి ఎదురు కాలేదు. కానీ అన్నింటినీ పంటి బిగువున అదిమిపట్టాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఎవరెన్ని విధాలుగా మాటల దాడి చేసినా సంయమనం కోల్పోలేదు. ప్రతి విమర్శలు చేయలేదు. తనదైన రోజుకోసం ఎదురుచూశాడు. ఆ అవకాశం ఇంగ్లండ్‌తో రెండో వన్డే రూపంలో లభించింది. అంతే..దెబ్బతిన్న పులిలా గర్జించాడు. తనలోని బ్యాటర్‌ను వెలికి తీశాడు. ఇంగ్లండ్‌ పేసర్లు, స్పిన్నర్ల భరతం పట్టి పరుగుల సునామీ సృష్టించాడు. తన పని అయిపోలేదని, ఇంకా ఎంతో క్రికెట్‌ మిగిలి ఉందని నిరూపించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కి ‘హిట్‌మ్యాన్‌’ను మరోసారి ఆవిష్కరించాడు. మ్యాచ్‌లో రోహిత్‌ సంధించిన ఫోర్లు, సిక్సర్ల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పేసర్‌ అట్కిన్సన్‌ వేసిన భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో..క్రీజు బయటకు వచ్చి కొట్టిన బౌండరీతోపాటు తదుపరి బంతిని ఎలాంటి ప్రయాస లేకుండా ఫ్లిక్‌ షాట్‌తో సిక్సర్‌గా మలుస్తూ తన ‘తుఫాన్‌’కు శ్రీకారం చుట్టిన రోహిత్‌ కిక్కిరిసిన బారాబతి స్టేడియాన్ని హోరెత్తించాడు. రషీద్‌ బౌలింగ్‌లో కట్‌ షాట్‌తో హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్‌..అదే రషీద్‌ బంతిని లాంగా్‌ఫలో అద్భుత సిక్సర్‌గా కొట్టి తనదైన శైలిలో సెంచరీ పూరించాడు. దాంతో ఫ్యాన్స్‌ హర్షధ్వానాలతో స్టేడియం దద్దరిల్లింది. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఈ ఇన్నింగ్స్‌తో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్న రోహిత్‌..ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


2

వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. షాహిద్‌ అఫ్రిదీ (351) టాప్‌లో ఉన్నాడు. అలాగే రోహిత్‌కు కెరీర్‌లో ఇది రెండో వేగవంతమైన శతకం (76 బంతుల్లో).

2

వన్డేల్లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన రెండో అతిపెద్ద వయస్కుడిగా (32 ఏళ్లు) వరుణ్‌ చక్రవర్తి. ఫరూఖ్‌ ఇంజనీర్‌ 36 ఏళ్ల వయస్సులో తొలి వన్డే ఆడాడు.

1

ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక హాఫ్‌ సెంచరీలు (56) సాధించిన బ్యాటర్‌గా జో రూట్‌.

1

300+ స్కోర్లు సాధించినా ఎక్కువసార్లు (28) ఓడిన జట్టుగా ఇంగ్లండ్‌.

3

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సెంచరీలు (49) సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్‌. సచిన్‌ (100), కోహ్లీ (81) ముందున్నారు.


ఇవీ చదవండి:

భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 05:41 AM