Share News

Rohit Sharma: మరింత బరువు తగ్గనున్న హిట్‌మ్యాన్!

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:14 PM

రోహిత్ వెయిట్‌లాస్ జర్నీ మరింత కాలం కొనసాగుతుంది. గత మూడు నెలల్లో అతడు 11 కిలోల బరువు తగ్గాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు మరో నెల రోజుల సమయం ఉంది. నాటి కల్లా మరింత బరువు తగ్గి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Rohit Sharma: మరింత బరువు తగ్గనున్న హిట్‌మ్యాన్!

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే నాటికి రోహిత్ శర్మ(Rohit Sharma)పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. అధిక బరువుతో 2027 ప్రపంచ కప్(WC 2027) వరకు ఫిట్‌నెస్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. చివరి సారిగా రోహిత్ శర్మను గ్రౌండ్‌లో చూసింది 2025 ఐపీఎల్‌లో. కట్ చేస్తే.. సూపర్ స్లిమ్ అయి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముందు సియాట్ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైన హిట్‌మ్యాన్‌ను చూసి అందరూ అవాక్కయ్యారు. జెర్సీ నంబర్ 45లో ‘టార్గెట్ 2027’ లోడింగ్.. అంటూ నెట్టింట ఫ్యాన్స్ హడావిడి చేశారు. అయితే తాజాగా రోహిత్ ఫిట్‌నెస్‌పై అతడి చిరకాల మిత్రుడు అభిషేక్ నాయర్(Abhishek Nayar) స్పందించాడు.


‘రోహిత్ వెయిట్‌లాస్ జర్నీ మరింత కాలం కొనసాగుతుంది. గత మూడు నెలల్లో అతడు 11 కిలోల బరువు తగ్గాడు. రోహిత్ ఫ్లైట్‌లో భారత్ తిరిగి వచ్చే సమయంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఇష్టమైన ఆహారాన్ని వదిలేశాడు. దాని ఫలితాలు ఈ సిరీస్‌లో కనిపించాయి. సౌతాఫ్రికాతో సిరీస్‌కు మరో నెల రోజుల సమయం ఉంది. నాటి కల్లా మరింత బరువు తగ్గి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని అభిషేక్ నాయర్ సిడ్నీ మ్యాచ్ సమయంలో బ్రాడ్‌కాస్టర్ వద్ద వ్యాఖ్యానించాడు.


నాయర్ ఉన్నాడుగా...

రోహిత్ బరువు తగ్గడానికి ముఖ్య కారణం టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్. రోహిత్‌కు జిమ్‌లో నిత్యం సాయం చేశాడు. అత్యధిక రిపిటేషన్లతో బాడీబిల్డర్ స్థాయిలో రోహిత్ చమటోడుస్తున్నాడని నాయర్ పెర్త్‌లో మ్యాచ్ సందర్భంగా తెలిపాడు.

‘అతడి ట్రైనింగ్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. చివరికి టీమిండియా కండీషనింగ్ కోచ్ కూడా నన్ను మందలించేవాడు. రోహిత్ రోజుకు శరీరంలోని ప్రతి భాగం కోసం 700-800 రిపిటేషన్లు చేసేవాడు. అది దాదాపు గంటన్నర సెషన్. ఇది తేలికపాటి బరువులతో జరిగేది. దీంతోపాటు ప్రతి సెషన్‌లో 15-20 నిమిషాలు క్రాస్ ఫిట్ ట్రైనింగ్ చేసి ముగించేవాళ్లం. వారంలో ఆరు రోజులపాటు ఇలా మూడు నెలలు శిక్షణ జరిగింది.


అంతేనా.. తనకిష్టమైన వడపావ్‌ను తినడం మానేశాడు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకున్నాడు. మూడు గంటలు జిమ్‌లో పడిన శ్రమ ఫలించాలంటే ఆ తర్వాత ఉన్న 21 గంటలు నియంత్రించుకోవడం చాలా అవసరం. తొలి ఎనిమిది వారాలు చాలా కఠినమైన శిక్షణ జరిగింది. ఒకానొక దశలో ఫిట్‌గా ఉండే కంటే చురుకైన క్రికెటర్‌గా ఉండటానికి రోహిత్ ఇష్టపడ్డాడు. ఆ తర్వాత వస్తున్న ఫలితాలకు అనుగుణంగా శిక్షణలో మార్పులు చేశాం. తొలిసారి ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడు.. ఓ డిఫెన్స్ షాట్ ఆడి నాన్‌ స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. వెంటనే ‘నేను గాల్లో ఎగురుతున్నాను’ అని గట్టిగా అరిచి చెప్పాడు. చాలా కాలం తర్వాత రోహిత్ తేలిగ్గా ఫీల్ అయ్యాడు.


2011లో రోహిత్ లావుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అప్పుడు కూడా రోహిత్ చాలా బరువు తగ్గి ఇలాంటి ఫిట్‌నెస్ సాధించాడు. ఇటీవల ఐపీఎల్ తర్వాత కూడా అలాంటి ఫొటో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దీంతో రోహిత్ ఫిట్‌నెస్‌పై చర్చ మొదలైంది. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.. ఆచరణలో పెట్టాడు.. బరువు తగ్గి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు 2027 వరకు రోహిత్ క్రికెట్ కెరీర్ ఉన్నట్లే’ అని అభిషేక్ నాయర్ వెల్లడించాడు.


Also Read:

ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

Updated Date - Oct 26 , 2025 | 07:14 PM