Rohit Sharma Future: అస్ట్రేలియాతో రెండో వన్డే.. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కాస్త భిన్నంగా రోహిత్ శైలి.. అభిమానుల్లో టెన్షన్
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:02 PM
రోహిత్ శర్మ భవిత్యంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ ఒకింత డల్‌గా కనిపించాడని, అతడిని తప్పించే అవకాశం ఉందన్న వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: హిట్‌మ్యాన్‌గా పేరొందిన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ప్రస్తుతం పరీక్షాకాలం నడుస్తోందని చెప్పకతప్పదు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రెండంకెల స్కోరు కూడా చేయలేక అభిమానులను నిరాశపరిచాడు. ప్రస్తుతం రెండో వన్డేకు సిద్ధమవుతున్నాడు. అడిలైడ్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరయ్యాడు. ఈ సెషన్‌లో రోహిత్ తన సహజశైలికి భిన్నంగా కనిపించడం అభిమానుల్లో టెన్షన్ పెంచేసింది. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న రోహిత్ ఇక వన్డేలకు గుడ్‌బై చెబుతాడా? అన్న వార్తలు జాతీయ మీడియాలో వైరల్‌గా మారాయి (Rohit Sharma).
సాధారణంగా రోహిత్ నెట్ ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో మీడియాతో మాట్లాడుతుంటాడు. అభిమానులను కూడా నవ్వుతూ పలకరిస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం రోహిత్ శైలి ఇందుకు భిన్నంగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్ తరువాత కూడా రోహిత్ మౌనంగా ఒక్కడే హోటల్‌కు వెళ్లిపోగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్ మాత్రం యశస్వీ జైస్వాల్‌తో సుదీర్ఘ చర్చలో మునిగిపోయారు. రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా యశస్వికి ఉందన్న అభిప్రాయం వినబడుతోంది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించిన సీన్స్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. రోహిత్‌ను బెంచ్‌కు పరిమితం చేసే ఛాన్సే లేకపోయినప్పటికీ ఇది అతడికి కచ్చితంగా పరీక్షా కాలం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది (Gambhir Chat with Jaiswal).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, వన్డేలకు సారథ్యం వహించాలని రోహిత్‌కు ఉన్నా ఆ బాధ్యతలను తప్పనిసరి పరిస్థితుల్లో గిల్‌కు అప్పగించాల్సి వచ్చిందట. వన్డే కెప్టెన్‌గా గిల్‌ను ప్రమోట్ చేసినట్టు తొలుత అగార్కర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో తన సత్తా చాటేందుకు రోహిత్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ను బాగా మెరుగుపరుచుకుని అభిమానులతో పాటు విమర్శకుల మెప్పును కూడా పొందాడు. అయితే, ఫిట్‌గా ఉన్నప్పటికీ తొలి వన్డేలో జస్ట్ 8 పరుగులకే హిట్‌మ్యాన్ వెనుదిరగడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవి కూడా చదవండి
మీరే వచ్చి తీసుకెళ్లండి.. బీసీసీఐకి రిప్లై ఇచ్చిన మోసిన్ నఖ్వీ
ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకపోతే.. ఏసీసీ చీఫ్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి