BCCI Warns Naqvi: ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకపోతే.. ఏసీసీ చీఫ్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
ABN , Publish Date - Oct 21 , 2025 | 03:14 PM
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ ఏసీసీ చీఫ్, పాక్ మంత్రి మోసిన్ నఖ్వీకి బీసీసీఐ ఈమెయిల్ చేసింది. ట్రోఫీని అప్పగించకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు చెందాల్సిన ఆసియా కప్ ట్రోఫీని దుబాయ్ ఏసీసీ కార్యాలయంలో లాక్ చేసి పెట్టిన పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మోసిన్ నఖ్వీకి బీసీసీఐ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని తిరిగివ్వని పక్షంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు నఖ్వీకి ఈమెయిల్ చేసింది. మోసిన్ ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నామని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా జాతీయ మీడియాకు తెలిపారు. ఈ విషయంలో ఓ క్రమపద్ధతిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు (BCCI E-Mail to ACC Chief Naqvi).
వివాదం మొదలైంది ఇలా..
ఆసియా కప్ టోర్నీలో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో, ఉక్రోషం పట్టలేక నఖ్వీ ఆ ట్రోఫీతో పాటు ఇతర మెడల్స్‌ను వెనక్కు తీసుకెళ్లిపోవాలని ఏసీసీ అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో వాటిని దాచిపెట్టాలని, తన అనుమతి లేకుండా ఎవ్వరికీ ఇవ్వొద్దని గట్టిగా చెప్పారు (Asia Cup Trophy Controversy).
టోర్నీ ముగిసి ఇన్ని రోజులు గడుస్తున్నా ట్రోఫీ చేతికందకపోవడంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో నఖ్వీ తీరుపై తీవ్ర అభ్యంతరం చేసింది. విజేతగా నిలిచిన టీమిండియాకు చెందిన ట్రోఫీని వెంటనే ఏసీసీకి అప్పగించాలని నఖ్వీని డిమాండ్ చేసింది. పాక్ సీనియర్ మంత్రి నుంచి ట్రోఫీని స్వీకరించబోమని అంతకుముందే బీసీసీఐ సెక్రెటరీ తేల్చి చెప్పారు. అంతమాత్రానికే ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకెళ్లే హక్కు ఆయనకు ఉండదని అన్నారు (BCCI Demands Trophy to be Returned).
ఈ పరిస్థితుల్లో నఖ్వీ ఏసీసీ బోర్డు సభ్యులకు క్షమాపణలు చెప్పినా తన చర్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ట్రోఫీ కావాలనుకుంటే టీమిండియా కెప్టెన్ దుబాయ్‌కు వచ్చి తీసుకెళ్లాలని కొత్త మెలిక పెట్టారు. దీన్ని బీసీసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దుబాయ్‌కు మళ్లీ వెళ్లి ట్రోఫీ తెచ్చుకునేందుకు సహేతుకమైన కారణం ఏదీ లేదని స్పష్టం చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే అప్పగించాల్సిన ట్రోఫీని ఇవ్వకుండా మళ్లీ దుబాయ్‌కు వచ్చి తీసుకెళ్లాలని చెప్పడం అర్థరహితమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలి.. షమీ వివాదంపై ఆర్ అశ్విన్ కామెంట్
గిల్ కెప్టెన్సీ బాలేదు..టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి