Mohsin Naqvi: మీరే వచ్చి తీసుకెళ్లండి.. బీసీసీఐకి రిప్లై ఇచ్చిన మోసిన్ నఖ్వీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:12 PM
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ బీసీసీఐ పంపిన ఈమెయిల్‌కు ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ స్పందించారు. దుబాయ్‌కు వచ్చి తన నుంచి ట్రోఫీ తీసుకెళ్లాలని బదులిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ విజేతగా నిలిచిన తమకు ట్రోఫీని పంపించాలంటూ ఏసీసీ చీఫ్, పాక్ మంత్రి మోసిన్ నఖ్వీకి బీసీసీఐ ఈ-మెయిల్ చేసిన విషయం తెలిసింది. ఈ మెయిల్‌కు నఖ్వీ తాజాగా స్పందించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దుబాయ్‌కు వచ్చి తన వద్ద నుంచి ట్రోఫీ తీసుకెళ్లాలని నఖ్వీ స్పష్టం చేశారు. తాను ట్రోఫీని భారత్‌కు పంపించేది లేదని తేల్చి చెప్పారు (ACC Chief Mohsin Naqvi Reply to BCCI).
ఆసియా కప్ విజేత అయిన టీమిండియాకు ట్రోఫీ దక్కాలని మోసిన్ పేర్కొన్నారు. అయితే, నాటి ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రదాన కార్యక్రమానికి హాజరు కావట్లేదనే విషయాన్ని బీసీసీఐ ముందుగా ఏసీసీ కార్యాలయానికి సమాచారం అందించలేదని మోసిన్ తన లేఖలో పేర్కొన్నారు. అప్పటికే మైదానంలో ట్రోఫీ ప్రదాన కార్యక్రమానికి సంబంధించిన వేదిక కూడా ఏర్పాటైందని చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో బీసీసీఐ ప్రతినిధి వచ్చి తమకు టీమిండియా రావట్లేదన్న సమాచారాన్ని అందించారని అన్నారు. క్రీడా సంప్రదాయాలను కాపాడేందుకు తాము ప్రయత్నించామని, విజేతలకు ట్రోఫీ అందించేందుకు సుమారు 40 నిమిషాలు అక్కడే వేచి చూశామని చెప్పుకొచ్చారు( BCCI Asia Cup trophy letter).
ప్రస్తుతం ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉందని అన్నారు. బీసీసీఐ అధికార ప్రతినిధితో పాటు మరో ప్లేయర్ వచ్చి తన నుంచి ట్రోఫీని తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అధికారికంగా అన్ని లాంఛనాలతో ఆనవాయితీలను కొనసాగించేలా జరగాలని కూడా చెప్పుకొచ్చారు. క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించే ఏ చర్యకూ తాము అంగీకరించబోమని కూడా లేఖలో రాసుకొచ్చారు. అయితే, ఈ విషయంలో ఇప్పటికే అప్ఘానిస్థాన్, శ్రీలంక భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై తేల్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. యూవీ లైట్స్‌తో పిచ్‌ను ఆరబెట్టి..
ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకపోతే.. ఏసీసీ చీఫ్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి