Share News

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాయాజాలం..ఇంటికెళ్లిన రాజస్థాన్‌ రాయల్స్

ABN , Publish Date - May 02 , 2025 | 11:26 AM

ఐపీఎల్ 2025 మొదట్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉన్న ముంబై (Mumbai Indians) జట్టు, ప్రస్తుతం అగ్రస్థానంలోకి చేరుకుంది. సమన్వయంతో ఆడిన ఆటగాళ్లు వరుసగా ఆరో విజయం నమోదు చేయడం విశేషం. దీంతో ప్రత్యర్థి జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాయాజాలం..ఇంటికెళ్లిన రాజస్థాన్‌ రాయల్స్
Mumbai Indians

ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టుకు ఐపీఎల్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానముంది. కానీ ఈ సీజన్లో మొదట్లో తడబడిన ముంబై జట్టు, ప్రస్తుతం క్రమంగా పుంజుకుని టాప్ స్థాయికి చేరుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. నిన్న రాజస్థాన్ రాయల్స్ (RR)పై జరిగిన మ్యాచులో 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో వరుసగా ఆరో విజయం నమోదు చేసింది. ఈ విజయంతో MI 14 పాయింట్లతో టాప్‌లో నిలవగా, RR 6 పాయింట్లతో ప్లేఆఫ్ రేస్‌ నుంచి తప్పుకుంది.


టాస్ ఓడిన తర్వాత

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు అదరగొట్టింది. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) మొదటి వికెట్‌కి 116 పరుగులు చేశారు. ఆ తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్, 23 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (48 నాటౌట్, 23 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి వేగంగా స్కోరు పెంచారు. ఈ ఇద్దరూ కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరు బోర్డును 217/2 వరకూ తీసుకెళ్లారు. రాజస్థాన్ బౌలర్లలో మాహీష్ థీక్షణా, కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీసారు.


ప్రత్యర్థి జట్టుకు..

లక్ష్యచేదనలో దిగిన రాజస్థాన్‌కు మొదటి నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. MI పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కలిసి పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిని వణికించారు. దీంతో RR స్కోరు 47/5కి పడిపోయింది. జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కొంత ఆడినప్పటికీ, ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. చివరికి RR 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. కర్న్ శర్మ (3/23), ట్రెంట్ బౌల్ట్ (3/28), బుమ్రా (2/15) అద్భుతంగా బౌలింగ్ వేసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. కెప్టెన్ హార్దిక్ కూడా ఒక వికెట్ తీసాడు. బుమ్రా, శర్మ ధాటికి తట్టుకోలేకపోయారు.

తదుపరి మ్యాచ్‌పై దృష్టి

ముంబై (Mumbai Indians) ప్రస్తుతం 7 గెలుపులతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఇంకో రెండు మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఈ జట్టు గుజరాత్ టైటన్స్‌తో మే 6న వాంఖడేలో జరిగే మ్యాచుకు సిద్ధంగా ఉంది.


ఇవి కూడా చదవండి:

GT vs SRH Prediction: నేటి హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..మనోళ్లు గెలుస్తారా లేక..



Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 02 , 2025 | 11:27 AM