Mohammad Kaif: యువ ఆటగాళ్లు కాదు.. రో-కోనే దిక్కు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:43 AM
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి వన్డేలో రో-కో అద్భుత ప్రదర్శనతో 17 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌తో సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరుగులు చేయకుండా పెవిలియన్ చేరితే మ్యాచ్ కచ్చితంగా ఓడిపోయేది. భారత జట్టు 300కి పైగా పరుగులు చేయలేకపోతే.. సౌతాఫ్రికా విజయం సాధించి ఉండేది అనే దాంట్లో సందేహమే లేదు. టీమిండియా గెలవాలంటే.. రో-కో రాణించాలన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడంతా యువ క్రికెటర్లపై చర్చ జరుగుతోంది. జట్టులో వారికి పెద్ద సంఖ్యలో చోటు కల్పిస్తున్నారు. కానీ వారంతా కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోతున్నారు. చివరికి టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే దిక్కయ్యారు’ అని కైఫ్ విశ్లేషించాడు.
సంబంధం ఉంది..
‘విరాట్ సెంచరీకి, టీమిండియా విజయానికి సంబంధం ఉంది. అతడు ఏడు సిక్స్‌లు బాదితే, రోహిత్ మూడు సిక్సులు కొట్టాడు. వారు సిడ్నీలో చేసినట్లుగానే రాంచీలోనూ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి బాగాలేదు. సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత, రాంచీ వన్డేలో విజయం ఊరట కలిగించేదే. ప్రస్తుతం కోహ్లీకి 37, రోహిత్‌కు 38 ఏళ్లు. వారు పరుగులు చేయకుండా ఉండి ఉంటే.. సౌతాఫ్రికా సునాయసంగా రాంచీ వన్డేలో గెలిచి ఉండేది’ అని కైఫ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!
అరుదైన మైలురాయికి చేరువలో హిట్‌మ్యాన్!