Wayne Larkins: 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ క్రికెటర్ కన్నుమూత
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:25 AM
86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) ఇకలేరు. 71 ఏళ్ల వయసులో మరణించారు. దీంతో అనేక మంది ప్రముఖులు ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
71 ఏళ్ల వయసులో మాజీ ఇంగ్లీష్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) కన్నుమూశారు. క్రీడా ప్రపంచంలో నెడ్‌గా ప్రసిద్ధి చెందిన లార్కిన్స్ చాలా కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. అతను 1953 నవంబర్ 22న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాక్స్టన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. 1979 నుంచి 1991 మధ్య కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున వేన్ లార్కిన్స్ 13 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. ఆ సమయంలో అతను 25 ఇన్నింగ్స్‌లలో 20.54 సగటుతో 493 పరుగులు, 24 ఇన్నింగ్స్‌లలో 24.62 సగటుతో 591 పరుగులు చేశాడు. టెస్ట్‌లలో మూడు హాఫ్ సెంచరీలు, వన్డేలలో ఒక సెంచరీ చేశాడు.
ఎన్ని పరుగులు చేశాడంటే..
అతను ఇంగ్లాండ్‌కు మాత్రమే కాకుండా దేశీయ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్, డర్హామ్, బెడ్ ఫోర్డ్‌షైర్‌లకు ప్రాతినిధ్యం వహించడంలో కీలక పాత్ర పోషించాడు. దేశీయ క్రికెట్‌లో అతను మొత్తం 482 ఫస్ట్ క్లాస్, 485 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 842 ఇన్నింగ్స్‌లలో లార్కిన్స్ 34.44 సగటుతో 27,142 పరుగులు పూర్తి చేశాడు. లిస్ట్ Aలో 467 ఇన్నింగ్స్‌లలో అతను 30.75 సగటుతో 13,594 పరుగులు సాధించాడు.
59 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు
వేన్ లార్కిన్ బ్యాటింగ్ లో ఫస్ట్ క్లాస్‌లో 59 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ A క్రికెట్‌లో 26 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు కలవు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని వ్యక్తిగత ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన 252 పరుగులు. లిస్ట్ A క్రికెట్‌లో అతను 172 పరుగులతో అజేయంగా నిలిచాడు. లార్కిన్స్ తన క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌తో సహా 1,358 ఇన్నింగ్స్‌లలో 41,820 పరుగులు చేయడం విశేషం. ఈ సమయంలో అతను మొత్తం 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి