Rohini Kalam: జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:15 PM
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం(35) ఆత్యహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో ఇండియాకి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది.
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు(Jujitsu) క్రీడాకారిణి రోహిణి కలాం(35) ఆత్యహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో ఇండియాకి రోహిణి కలాం(Rohini Kalam) ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆమె.. దేవాస్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి (Suicide) పాల్పడింది. రోహిణి కలాం గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తన సోదరి ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒత్తిడి కారణంగానే రోహిణి ఆత్మహత్యకు పాల్పడిందని తన సోదరి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు రోహిణి సోదరి రోష్మి కీలక విషయాలు వెల్లడించింది. ‘అష్టాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా రోహిణి పని చేస్తోంది. శనివారం దేవాస్‌లోని ఇంటికి తిరిగి వచ్చింది. ఉద్యోగ సంబంధిత ఒత్తిడిలో ఉన్నట్లు నాకు అనిపించింది. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుని ఫోన్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్లింది. ఫోన్‌లోనే పాఠశాలలో అధ్యాపకులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఎవరితోనో చెప్పడం నేను విన్నాను’ అని తెలిపింది.
రోహిణి కలాం కెరీర్ ఇలా..
2007లో రోహిణి తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రొఫెషనల్ జియు-జిట్సు కెరీర్‌ను 2015లో ప్రారంభించింది. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రపంచ క్రీడలకు ఎంపికైన ఏకైక భారతీయ అథ్లెట్‌గా అరుదైన ఘనతను సాధించింది. థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 48 కిలోల విభాగంలో కాంస్యం, అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జియు-జిట్సు ఛాంపియన్‌షిప్ 2024 డ్యూయో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్యం సాధించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Ranji Trophy 2025: పృథ్వీ షా విధ్వంసం
Shreyas Iyer-BCCI: శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్!