Harmanpreet Kaur: మేము మ్యాచ్ ఓడటానికి కారణం అదే..
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:09 PM
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ కు తొలి పరాజయం ఎదురైంది. శ్రీలంక, పాకిస్థాన్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ లో భారత్ చక్కటి ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకుంది. అయితే హ్యాట్రిక్ విజయం అందుకోవాలని భావించిన భారత్ కు సఫారీ జట్టు బ్రేక్ వేసింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ కు తొలి పరాజయం ఎదురైంది. శ్రీలంక, పాకిస్థాన్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ లో భారత్ చక్కటి ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకుంది. అయితే హ్యాట్రిక్ విజయం అందుకోవాలని భావించిన భారత్ కు సఫారీ జట్టు బ్రేక్ వేసింది. గురువారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఒక దశలో భారత్ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే సౌతాఫ్రికా బ్యాటర్ నాడిన్ డి క్లెర్క్ (84*) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా పరాజయంపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) స్పందించారు.
టాపార్డర్ వైఫల్యంతోనే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్(INDW vs SAW)లో ఓటమిపాలయ్యామని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. తమ కంటే సఫారీ బ్యాటర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారని, ఈ విజయానికి వారు అర్హులని తెలిపింది. జట్టుగా తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని, ముఖ్యంగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కౌర్ అభిప్రాయపడింది. ఈ మ్యాచ్ ఎంతో కఠినమైనదని, ఇరు జట్లు అద్భుతంగా ఆడాయని ఆమె తెలిపారు. తమ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ కారణంగా 250 పరుగులు చేయగలిగామని హర్మన్ ప్రీత్ అన్నారు. తాము భారీ స్కోర్ చేసినప్పటికీ సఫారీ బ్యాటర్లలో క్లో, డిక్లెర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని వెల్లడించింది.
ఇక భారత్ బ్యాటర్ రిచా ఘోష్ పై హర్మన్ ప్రశంస వర్షం కురిపించింది. 'రిచా ఘోష్(Richa Ghosh) ఎప్పుడూ ఇలాంటి ప్రదర్శనలే ఇస్తోంది. ఆమె మ్యాచ్‌ను ములపు తిప్పగల వ్యక్తి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఆమె ఆడిన విధానానికి మేం ఫిదా అయ్యాం. భారీ షాట్స్ ఆడటం ఆమె వ్యక్తిత్వం. ఈ టోర్నీ ఆసాంతం రిచా ఇదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నా. అలానే టాప్ ఆర్డర్‌గా మేం బాధ్యత తీసుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోయాం. మేం మా బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. ఈ వైఫల్యాల నుంచి మేం చాలా నేర్చుకోవాల్సి ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో మేం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేశాం. మా తప్పులు సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్ లో విజయం సాధించేందుకు కృషి చేస్తాము' అని హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) చెప్పుకొచ్చింది.