India vs Pakistan Asia Cup 2025: పాక్‌ను కుమ్మేశారు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:52 AM
దేశమంతటా బాయ్‌కాట్ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న వేళ.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా కోలుకోలేని దెబ్బకొట్టింది. తమతో ఆట అంత సులువు కాదని చాటి చెబుతూ ఆసియా కప్‌లో పాక్‌పై విజయభేరి మోగించింది...
ఆసియా కప్‌లో నేటి మ్యాచ్‌లు
యూఏఈ X ఒమన్ (సా.5.30 )
శ్రీలంక గీహాంకాంగ్ (రా.8.00 )
రాణించిన సూర్య అభిషేక్, తిలక్
కుల్దీ్‌పనకు మూడు వికెట్లు
ఆసియాకప్
ఏడు వికెట్లతో టీమిండియా ఘనవిజయం
దేశమంతటా బాయ్‌కాట్ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న వేళ.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా కోలుకోలేని దెబ్బకొట్టింది. తమతో ఆట అంత సులువు కాదని చాటి చెబుతూ ఆసియా కప్‌లో పాక్‌పై విజయభేరి మోగించింది. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ బంతితో చెలరేగితే.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్‌కు సూర్య కుమార్, తిలక్ జత కలవడంతో పాక్ నిర్దేశించిన స్వల్ప స్కోరును భారత్ సులువుగా ఛేదించింది.
దుబాయ్: ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు దూసుకెళ్తోంది. పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆదివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ (37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 నాటౌట్) అజేయంగా నిలిచాడు. తాజా టోర్నీలో భారత్‌కిది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40), షహీన్ అఫ్రీది (16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్) ఆకట్టుకున్నారు. స్పిన్నర్ కుల్దీ్‌పనకు మూడు.. అక్షర్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్ (13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), తిలక్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించారు. సయీమ్‌కు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఇక.. గతంలో మాదిరిగా ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అమితోత్సాహం కనిపించలేదు. అలాగే దుబాయ్ స్టేడియాన్ని కమ్మేసే సెలెబ్రిటీల హంగామాగానీ అసలే కనిపించలేదు.
దూకుడుతో మొదలు..
స్వల్ప ఛేదనను భారత్ మెరుపు వేగంతో ఆరంభించడంతో పవర్‌ప్లేలోనే సగం స్కోరందుకుంది. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులనే ఓపెనర్ అభిషేక్ శర్మ 4,6గా మలిచాడు. అటు గిల్ (10) తర్వాతి ఓవర్‌లోనే రెండు వరుస ఫోర్లు సాధించినా సయీమ్ అయూబ్ క్యారమ్ బాల్‌కు స్టంపౌట్ అయ్యాడు. ఇక షహీన్ ఓవర్‌లో అభిషేక్ మరోసారి 4,6తో ధాటిని కనబర్చాడు. అయితే తను కూడా సయీమ్ అయూబ్‌కే చిక్కాడు. నాలుగో ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు సాధించిన అభిషేక్ లాంగా్‌ఫలో అష్రా్‌ఫకు క్యాచ్ ఇచ్చాడు. ఇక తిలక్ ఆరో ఓవర్‌లో 13 రన్స్ అందించడంతో జట్టు 61/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం స్పిన్నర్లు అబ్రార్, సుఫియాన్ కట్టడి చేయడంతో సూర్య, తిలక్ కాసేపు ఆచితూచి ఆడారు. అయితే డ్రింక్స్ బ్రేక్‌కు ముందు తిలక్ 6,4తో బ్యాట్‌కు పనిజెప్పాడు. చక్కగా కుదురుకున్న ఈ జోడీని మళ్లీ సయీమ్ విడదీశాడు. 13వ ఓవర్‌లో అద్భుతంగా టర్న్ అయిన బంతికి తిలక్ బౌల్డ్ కావడంతో, మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో సూర్య వేగం పెంచాడు. గతంలో పాక్‌పై ఎన్నడూ 20+ రన్స్ దాటని తను ఈసారి ఆ అడ్డంకిని అధిగమిస్తూ వరుస ఫోర్లతో చెలరేగాడు. దూబే (10 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 34 రన్స్ జోడించిన సూర్య ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
దెబ్బతీసిన స్పిన్నర్లు
టాస్ గెలిచిన పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ భారీ స్కోరు సాధించాలనే ఆలోచనతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ అతడి వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ ఎదురుదాడికి దిగే ప్రయత్నంలో చకచకా పెవిలియన్‌కు చేరారు. భారత స్పిన్‌త్రయం ఆరు వికెట్లను నేలకూల్చగా.. ఓపెనర్ ఫర్హాన్ ఒక్కడే దీటుగా ఆడాడు. అయితే ఆఖర్లో షహీన్ షా చెలరేగి ఊరటనిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సయీమ్ అయూబ్‌ను హార్దిక్ గోల్డెన్ డకౌట్ చేశాడు. ఇక రెండో ఓవర్‌లో మహ్మద్ హారిస్ (3)ను బుమ్రా అవుట్ చేయడంతో ఆరు పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో మరో ఓపెనర్ ఫర్హాన్, ఫఖర్ జమాన్ (17) జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఫర్హాన్ భారత బౌలర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు. మూడో ఓవర్‌లో ఫఖర్ రెండు ఫోర్లతో 13 రన్స్ వచ్చాయి. ఇక బుమ్రా రెండు వరుస ఓవర్లలోనూ ఫర్హాన్ రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. వాస్తవానికి పాక్‌తో ఆడిన చివరి ఐదు టీ20ల్లో బుమ్రా కనీసం ఒక్క సిక్సర్‌ను కూడా ఇవ్వలేదు. వీరి జోరుతో పవర్‌ప్లేలో జట్టు 42/2 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్ల రాకతో పాక్ కష్టాలు పెరిగాయి. కాస్త కుదురుకున్న ఫఖర్ జమాన్‌ను అక్షర్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ సల్మాన్ (3)ను కూడా అక్షర్ అవుట్ చేయగా, 13వ ఓవర్‌లో కుల్దీప్ వరుస బంతుల్లో హసన్ (5), నవాజ్ (0)లను వెనక్కి పంపాడు. మరో ఎండ్‌లో ఓపిగ్గా క్రీజులో నిలిచిన ఫర్హాన్‌ను సైతం కుల్దీప్ దెబ్బతీయడంతో పాక్ 83 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వంద పరుగులు కూడా కష్టమే అనిపించింది. అయితే షహీన్ షా వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆఖరి ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 16 రన్స్ అందించాడు. దీంతో పాక్ కాస్త పోరాడగలిగే స్కోరందుకుంది. అలాగే జట్టు మొత్తంగా 63 డాట్ బాల్స్‌ను ఆడడం గమనార్హం.
స్కోరుబోర్డు
పాకిస్థాన్: సయీమ్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0, ఫర్హాన్ (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 40, హరీస్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 3, ఫకర్ (సి) తిలక్ (బి) అక్షర్ 17, సల్మాన్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 3, హసన్ నవాజ్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 5, మహ్మద్ నవాజ్ (ఎల్బీ) కుల్దీప్ 0, ఫహీమ్ (ఎల్బీ) వరుణ్ 11, అఫ్రీది (నాటౌట్) 33, సుఫియాన్ (బి) బుమ్రా 10, అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 127/9; వికెట్ల పతనం: 1-1, 2-6, 3-45, 4-49, 5-64, 6-64, 7-83, 8-97, 9-111; బౌలింగ్: హార్దిక్ 3-0-34-1, బుమ్రా 4-0-28-2, వరుణ్ చక్రవర్తి 4-0-24-1, కుల్దీప్ యాదవ్ 4-0-18-3, అక్షర్ పటేల్ 4-0-18-2, అభిషేక్ 1-0-5-0.
భారత్: అభిషేక్ (సి) ఫహీమ్ (బి) సయీమ్ 31, గిల్ (స్టంప్డ్) హరీస్ (బి) సయీమ్ 10, సూర్యకుమార్ (నాటౌట్) 47, తిలక్ (బి) సయీమ్ 31, శివమ్ దూబే (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 15.5 ఓవర్లలో 131/3; వికెట్ల పతనం: 1-22, 2-41, 3-97; బౌలింగ్: అఫ్రీది 2-0-23-0, సయీమ్ 4-0-35-3, అబ్రార్ 4-0-16-0, మహ్మద్ నవాజ్ 3-0-27-0, సుఫియాన్ 2.5-0-29-0.

నో షేక్‌హ్యాండ్స్
పాక్‌తో మ్యాచ్ ఆడడంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ఆటగాళ్లు కూడా వారితో అంటీముట్టనట్టుగా మెలిగారు. వారితో మాట్లాడడం కాదు కదా.. కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. టాస్ సమయంలోనూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కరచాలనం చేసుకోలేదు. అలాగే సూర్య సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాక పాక్ ప్లేయర్లను కలవకుండానే దూబేతో కలిసి చకచకా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అటు పాక్ ఆటగాళ్లు భారత డగౌట్ వైపు వచ్చినా భారత క్రికెటర్లు మాత్రం బయటికి రాలేదు. ఈ విషయమై పాక్ కోచ్ మైక్ హెస్సెన్ మ్యాచ్ అధికారులతో మాట్లాడుతూ అసహనం ప్రదర్శించడం కనిపించింది.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి