Jamal Musiala: ఫుట్‌బాల్ ప్రపంచంలో కుదుపు.. ఇలాంటి ఘటన ఎప్పుడూ చూసుండరు!
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:32 AM
ఫుట్‌బాల్ ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఓ స్టార్ ప్లేయర్‌కు అయిన గాయం అందర్నీ బాధిస్తోంది. అసలు ఎవరా ఆటగాడు? గ్రౌండ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఆటల్లో గాయాలు సహజమే. అందునా ఫుట్‌బాల్ లాంటి కాంటాక్ట్ గేమ్స్‌లో ఇది మరీ ఎక్కువ. బంతిని డిఫెండ్ చేసే క్రమంలో ఒకర్నొకరు ఢీకొని ప్లేయర్లు గాయాలబారిన పడిన సందర్భాలు బోలెడు. ఇలా గాయాల వల్ల నెలల పాటు ఆటకు దూరమవడం కూడా చూస్తుంటాం. అలాంటి ఓ ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆ ఘటన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. పారిస్ సెయింట్-జర్మన్ ఎఫ్‌సీకి బెయర్న్ మ్యూనిక్‌కు జరిగిన మ్యాచ్‌లో మిడ్‌ఫీల్డర్ జమాల్ ముసియాలా తీవ్రంగా గాయపడ్డాడు.
గోల్‌కీపర్‌ను ఢీకొట్టి..
ప్రస్తుత తరం ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న జమాల్ ముసియాలా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో గాయం బారిన పడ్డాడు. మ్యూనిక్ టీమ్ తరఫున బరిలోకి దిగిన ఈ ఫుట్‌బాలర్.. బంతిని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ప్రత్యర్థి గోల్‌కీపర్ డొన్నరుమ్మాను ఢీకొట్టాడు. అప్పటికే బంతిని అందుకునేందుకు వచ్చిన డొన్నరుమ్మా నేల మీద డైవ్ చేసేశాడు. దీంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన జమాల్ అతడ్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఈ క్రమంలో జమాల్ ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. ఢీకొన్న వేగానికి మడమ ఎముక పక్కకు జరిగింది. దీంతో నొప్పి తట్టుకోలేక కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడాడు. సహచరులు వచ్చి ధైర్యం చెప్పినా అతడు ఏడుస్తూనే ఉండిపోయాడు. ఆ తర్వాత స్ట్రెచర్‌లో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. గాయం నుంచి కోలుకునేందుకు కనీసం ఆరేడు నెలలు పడుతుందని, జమాల్ కమ్‌బ్యాక్‌కు ఏడాది కూడా పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
త్వరగా కోలుకోవాలంటూ..
గాయం నుంచి జమాల్ త్వరగా కోలుకొని రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఈ ఘటనపై స్టార్ ప్లేయర్లు స్పందిస్తున్నారు. అతడు త్వరగా కోలుకొని, తిరిగి అందర్నీ అలరించాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఫుట్‌బాల్‌కు జమాల్ అవసరం ఎంతగానో ఉందని.. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు గేమ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి