Australia Chase Down: 330 చాల్లేదు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:41 AM
క్రికెటర్ల బాదుడుకు విశాఖ స్టేడియంలో పరుగుల వరదే పారింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ధాటికి మిడిలార్డర్ తోడవ్వడంతో భారత్ ఏకంగా 330 పరుగులతో వహ్వా.. అనిపించింది. ఇక గెలుపు మనదే...
నేటి మ్యాచ్
దక్షిణాఫ్రికా Xబంగ్లాదేశ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
మహిళల వన్డే వరల్డ్‌కప్
330 చాల్లేదు
ఆస్ట్రేలియా రికార్డు ఛేదన
కెప్టెన్ హీలీ అద్భుత శతకం
661 పరుగులు.. భారత్-ఆస్ట్రేలియా మహిళా
క్రికెటర్ల బాదుడుకు విశాఖ స్టేడియంలో పరుగుల వరదే పారింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ధాటికి మిడిలార్డర్ తోడవ్వడంతో భారత్ ఏకంగా 330 పరుగులతో వహ్వా.. అనిపించింది. ఇక గెలుపు మనదే అని ఫ్యాన్స్ సంబరపడిన వేళ ప్రత్యర్థి ఆసీస్ మాత్రం ఎప్పటిలాగే తమ ప్రొఫెషనల్ ఆటతీరును చూపింది. లక్ష్యం ఎంత భారీదైనా తమ దూకుడు ముందు దిగదుడుపే అని నిరూపించింది. కెప్టెన్ అలీసా హీలీ ఆరంభం నుంచే కదం తొక్కుతూ అద్భుత శతకంతో ఛేదనకు మార్గం సుగమం చేసిన వేళ.. భారత బౌలర్ల పోరాటం చిన్నబోయింది.
భారత్‌కు రెండో ఓటమి
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో భారత్‌కు మరో ఝలక్. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడింది. అటు 331 పరుగుల రికార్డు ఛేదనను ఆస్ట్రేలియా తమ చాంపియన్ ఆటతీరుతో మరో 6 బంతులుండగానే ముగించడం విశేషం. కెప్టెన్ అలీసా హీలీ (107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142) విధ్వంసకర శతకంతో చెలరేగింది. ఇది భారత్‌కు వరుసగా రెండో ఓటమి కాగా.. ఆసీ్‌సకు నాలుగు మ్యాచ్‌ల్లో మూడో విజయం. ఓ మ్యాచ్ రద్దయ్యింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముం దుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80), ప్రతీకా రావల్ (96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 75) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హర్లీన్ (38), జెమీమా (33), రిచా (32) రాణించారు. పేసర్ సదర్లాండ్‌కు ఐదు, సోఫీకి మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 49 ఓవర్లలో 331/7 స్కోరుతో గెలిచింది. పెర్రీ (47 నాటౌట్), గార్డ్‌నర్ (45), లిచ్‌ఫీల్డ్ (40) గెలుపులో భాగమయ్యారు. శ్రీచరణికి మూడు.. దీప్తి, అమన్‌జోత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హీలీ నిలిచింది.
మెరుపు ఛేదన: భారీ లక్ష్యం కళ్లముందున్నా ఆసీస్ ఎలాంటి బెరుకు లేకుండా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఎనిమిదో ఓవర్‌లో హీలీ 6,4,4,4తో 19 రన్స్ రాబట్టింది. ఇక పదో ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్ నాలుగు ఫోర్లతో రాణించి 17 రన్స్ సమకూర్చడంతో పవర్‌ప్లేలో జట్టు 82 పరుగులతో నిలిచింది. అయితే శ్రీచరణి తన తొలి ఓవర్‌లోనే లిచ్‌ఫీల్డ్‌ను దెబ్బతీయడంతో మొదటి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు హీలీ బాదుడుకు 15 ఓవర్లలోనే జట్టు స్కోరు వందకి చేరింది. ఆ తర్వాత ఎలిస్ పెర్రీ 32 పరుగుల దగ్గర కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఈ సమయంలో బౌలర్లు పరుగులను కట్టడి చేయడంతో పాటు మూనీ (4), సదర్లాండ్ (0)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చారు. 31వ ఓవర్‌లో 4,4,6తో చెలరేగి 84 బంతుల్లోనే హీలీ కెరీర్‌లో ఆరో శతకాన్ని పూర్తి చేసింది. ఇక అత్యంత ప్రమాదకరంగా మారిన హీలీ జోరుకు స్నేహ్ రాణా అద్భుత క్యాచ్‌తో శ్రీచరణి బ్రేక్ వేసింది. ఇక 36 బంతుల్లో 32 పరుగులు కావాల్సి ఉండగా ఆసీస్ చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఈ స్థితిలో పెర్రీ తిరిగి మైదానంలో అడుగుపెట్టింది. కిమ్ గార్త్ (14 నాటౌట్)ను అండగా చేసుకుని ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేసింది. ఇక 12 బంతుల్లో 13 రన్స్ కావాల్సి వేళ 49వ ఓవర్‌లో గార్త్ ఫోర్.. చివరి బంతికి పెర్రీ సిక్సర్‌తో ఆసీ్‌సకు అద్భుత విజయాన్నందించారు.
ఆరంభం అదిరినా.. చివర్లో తడబాటు: ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఫామ్‌ను అందుకుని తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. మరో ఓపెనర్ ప్రతీకా రావల్‌తో పాటు మిడిలార్డర్ కూడా తలో చేయి వేయడంతో భారత్ పరుగుల వరద పారించింది. కానీ ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 36 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోవడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఏడో ఓవర్ ముగిసే సరికి స్కోరు 26 మాత్రమే. కానీ ఆ తర్వాత మంధాన లయ అందుకుంది. అడపాదడపా బౌండరీలతో మంధాన 46 బంతుల్లోనే ఫిఫ్టీని అందుకుంది. కాసేపటికే ప్రతీకా కూడా అర్థసెంచరీ పూర్తి చేసుకుంది. అయితే దూకుడు మీదున్న మంధాన స్లాగ్ స్వీప్‌నకు వెళ్లి లిచ్‌ఫీల్డ్‌కు క్యాచ్ ఇచ్చింది. ఈ దశలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి ప్రతీకాతో పాటు వేగంగా ఆడుతున్న హర్మన్‌ప్రీత్ (22), హర్లీన్‌ల వికెట్లను కూడా భారత్ కోల్పోయింది. 42 ఓవర్లలోనే స్కోరు 287/4తో అత్యంత పటిష్టంగా కనిపించింది. కానీ ఈ ప్రమాదకర జోడీని పేసర్ సదర్లాండ్ విడదీసింది. రిచాను అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇక్కడి నుంచి భారత వికెట్ల పతనం వేగంగా సాగింది. ఓ దశలో సునాయాసంగా 370 రన్స్ సాధిస్తుందనుకున్నప్పటికీ టెయిలెండర్లు అనవసర షాట్లతో వరుస విరామాల్లో పెవిలియన్‌కు చేరారు. దీంతో స్కోరు 330కే పరిమితమైంది.
మహిళల వన్డేల్లో వేగంగా (112 ఇన్నింగ్స్) 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా స్మృతి మంధాన. అలాగే ఈ ఏడాదిలో వెయ్యి రన్స్ పూర్తి చేసిన ఏకైక మహిళా బ్యాటర్‌గానూ నిలిచింది.
ఆసీస్ జట్టుపై వరుసగా ఐదుసార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన ఏకైక మహిళా బ్యాటర్‌గా మంధాన.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (13) నమోదు కావడం ఇదే తొలిసారి.
మహిళల వన్డే వరల్డ్‌క్‌పల్లో భారత జట్టుకిదే అత్యధిక స్కోరు (330). అలాగే వన్డేల్లో ఆసీస్‌పై ఎక్కువ స్కోరు సాధించిన జట్టుగా భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిచింది. ఇదే ఏడాది 369 రన్స్ సాధించగా, తాజాగా 330 పరుగులు సాధించింది.
మహిళల వన్డేల్లో అత్యధిక ఛేదనలు
లక్ష్యం ఛేదించిన జట్టు ప్రత్యర్థి ఎప్పుడు
330 ఆస్ర్టేలియా భారత్ 2025
302 శ్రీలంక దక్షిణాఫ్రికా 2024
289 ఆస్ర్టేలియా న్యూజిలాండ్ 2012
283 ఆస్ర్టేలియా భారత్ 2023
282 ఆస్ర్టేలియా భారత్ 2025
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News