Share News

Ashwin: టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:11 PM

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి కీలక సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసరమైతేనే టెస్టులు ఆడాలని అశ్విన్ పేర్కొన్నాడు.

Ashwin: టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా వన్డే సిరీస్‌కు వర్క్ లోడ్ కారణంగా దూరమయ్యాడు. దీని తర్వాత ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు మళ్లీ జట్టులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin).. బుమ్రాకు కీలక సూచనలు చేశాడు.


‘బుమ్రా(Jasprit Bumrah)తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను అతడికి దగ్గరగా ఉంటే.. బుమ్రాకు ఒకటే మాట చెబుతా.. వైట్ బాల్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తా. మరీ అవసరమైతే తప్పా టెస్టు క్రికెట్ ఆడొద్దని చెబుతా. కానీ అతడికి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడటం అంటే చాలా ఇష్టమన్న సంగతి నాకు తెలుసు. అతడు వీలైనంత కాలం టెస్టు క్రికెట్ ఆడటానికే మొగ్గు చూపుతాడు. అది చాలా ఛాలెంజింగ్ విషయమని కూడా అతడికి తెలుసు’ అని అశ్విన్ అన్నాడు.


అదే నాకిష్టం..

‘బుమ్రా టీ20 క్రికెట్ ఆడటాన్ని నేను ఇష్టపడతాను. అతడు అర్ధరహిత వన్డేలు ఆడాలని నేను కోరుకోను. టెస్టులు.. అది కూడా విదేశాల్లో జరిగే మ్యాచుల్లోనూ అతడు ఆడాలని కోరుకుంటున్నా. టీమిండియా స్వదేశంలో ఆడుతున్నప్పుడు ఇతర పేసర్ల సేవల్ని ఉపయోగించుకోవాలి’ అని అశ్విన్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!

మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Updated Date - Nov 29 , 2025 | 03:11 PM