Andre Russell: ఐపీఎల్‌కు రస్సెల్ రిటైర్‌మెంట్
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:50 PM
ఐపీఎల్ 2026కి ముందు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కాగా ఎన్నో ఏళ్లుగా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్‌ను.. ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026కి ముందు మరో ఊహించని పరిణామం ఎదురైంది. కేకేఆర్ డేంజరెస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వేలానికి ముందు ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రస్సెల్‌ను కేకేఆర్ వదిలేసింది. ఈ క్రమంలో అతడి ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది. కాగా వచ్చే సీజన్ నుంచి రస్సెల్ కేకేఆర్(KKR) పవర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
మాట తప్పింది..
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రస్సెల్ ఎన్నో ఏళ్లుగా కీలక ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఈ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో రస్సెల్‌ను కోల్‌కతా రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడిని జట్టులో కొనసాగించకుండా వేలానికి వదిలేసింది. భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన ఈ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ 2014లో కేకేఆర్‌లో చేరాడు. చాలా మ్యాచ్‌ల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 2014, 2024లో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, గతంలో రస్సెల్‌కు కేకేఆర్ ఓ హామీ ఇచ్చింది. ఈ ఆల్‌రౌండర్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికేంత వరకు తమ ఫ్రాంఛైజీలో భాగంగా ఉంటాడని 2020లో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు. ఇప్పుడు అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో గతంలో ఇచ్చిన హామీని ఫ్యాన్స్ తాజాగా గుర్తు చేసుకుంటున్నారు. కోల్‌కతా మేనేజ్‌మెంట్ ఇచ్చిన మాటను తప్పిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ!
ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్