బొమ్మల మ్యూజియం గురించి తెలుసా.. ఒకేచోట వెయ్యికిపైగా..
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:57 PM
వెంట్రిలాక్విజం... ఒక అరుదైన కళ. ‘మాట్లాడే బొమ్మ’గా విశేష గుర్తింపు పొందిన ఈ కళప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప కళాకారులు... పలు ప్రదర్శనల్లో ఉపయోగించిన బొమ్మలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
- మాట్లాడే బొమ్మల కొలువు
వెంట్రిలాక్విజం... ఒక అరుదైన కళ. ‘మాట్లాడే బొమ్మ’గా విశేష గుర్తింపు పొందిన ఈ కళప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప కళాకారులు... పలు ప్రదర్శనల్లో ఉపయోగించిన బొమ్మలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు వందలకు పైగా బొమ్మలను చూడొచ్చు. వెంట్రిలాక్విజానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న ఏకైక మ్యూజియం ఇదేనండోయ్...
స్టేజీపైన మాట్లాడే బొమ్మతో ప్రదర్శన జరుగు తుంటే చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. బొమ్మ మాట్లాడే మాటలు... వెంట్రిలాక్విస్ట్ గొంతు నుంచి వచ్చేవే అనే తలంపు ప్రేక్షకులకు ఏమాత్రం రాకుండా... ఆద్యంతం ఆసక్తిగా సాగే ప్రదర్శన వినోదం పంచుతుంది. ప్రస్తుతం అలాంటి అరుదైన కళను ప్రదర్శించేవారే కరువయ్యారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రదర్శనల్లో ఉపయోగించిన బొమ్మలను సేకరించి ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు. అదే ‘వెంట్ హావెన్ మ్యూజియం’. అమెరికాకు చెందిన కెంటకీ రాష్ట్రంలోని ఫోర్ట్ మిచెల్ పట్టణంలో ఉంది. బెర్గర్ అనే వ్యక్తి వెంట్రిలాక్విజంపై ఉన్న ఆసక్తితో 40 ఏళ్లపాటు శ్రమించి ఈ బొమ్మలను సేకరించారు. మ్యూజియంలో ప్రస్తుతం 1200 బొమ్మలున్నాయి. ఇందులో కొత్తవాటితో పాటు 19వ శతాబ్దంలో వెంట్రిలాక్విస్టులు ఉపయోగించిన బొమ్మలు కూడా ఉండటం విశేషం. అమెరికాకు చెందిన ప్రసిద్ధ వెంట్రిలాక్విస్టు జెఫ్ డన్‌హామ్ మ్యూజియం కోసం ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారు.

బెర్గర్ ఆశయాన్ని కొనసాగిస్తూ...
1972లో మ్యూజియం స్థాపకుడైన బెర్గర్ చనిపోయారు. ఆయన చనిపోయే సమయానికి మ్యూజియంలో ఉన్న బొమ్మలు ఐదు వందలు మాత్రమే. ఆ తరువాత మ్యూజియం నిర్వహణ బాధ్యతలను స్వేసి అనే మహిళ తీసుకున్నారు. బెర్గర్ ఆశయాన్ని కొనసాగిస్తూ ఆమె బొమ్మల సేకరణ చేశారు. ‘వెంట్ హావెన్ మ్యూజియం’ ప్రతి ఏడాది ‘ఇంటర్నేషనల్ వెంట్రిలాక్విజం కన్వెన్షన్’ పేరుతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుంచి సీనియర్, ఔత్సాహిక వెంట్రిలాక్విస్టులు హాజరవుతుంటారు. ఈ సందర్భంగా ప్రదర్శనలు, కళా మెళకువలు, బొమ్మల వ్యాపారం తదితర అంశాలను చర్చిస్తారు. మ్యూజియంలోని అరుదైన బొమ్మలను చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News