Share News

River: నదీ సంగమం... కాస్త వి‘చిత్రం’

ABN , Publish Date - Dec 07 , 2025 | 08:18 AM

నదులు సముద్రాల్లో కలిసే దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? అలాగే నదీ సంగమం కూడా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వచ్చిన నదులు... ఒకచోట కలిసి పెద్ద నదిగా మారి ప్రవహిస్తుంటాయు. ఆ సమయంలో వాటి రంగుల్లో తేడాలుండటం వల్ల అక్కడొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అలాంటి కొన్ని వి‘చిత్ర’ నదీ సంగమాల విశేషాలే ఇవి...

River: నదీ సంగమం... కాస్త వి‘చిత్రం’

ప్రకృతిలో అద్భుతాలకు కొదవేముంది? గలగలా పరవళ్లు తొక్కుతూ పారే వేర్వేరు నదులు కొన్ని పాంతాల్లో కలిసి ముందుకు సాగుతాయి. అయితే నదులు కలిసి ప్రవహించినా, వాటి నీటి రంగుల వల్ల విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. అలా నదులు కలిసినా, నీళ్లు కలవకపోవడానికి చాలా కారణాలుంటాయి.

కొన్ని నదుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. మరికొన్ని నదుల్లో నీరు బురదగా ఉంటుంది. నీలి రంగులో కొన్ని, పచ్చరంగులో మరికొన్ని ఉంటాయి. కొన్ని రకాల ఖనిజాలు, రసాయన సమ్మేళనాలు, నీటి అడుగున ఉన్న వృక్ష సంపద కారణంగా నదుల్లో నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంది. కొన్నిచోట్ల అధిక కాలుష్యం వల్ల నదిలో నీరు బురదమయంగా కనిపిస్తుంది. రాతి పర్వతాల్లో ప్రవహించే నీరు స్వచ్ఛంగా కనిపిస్తుంది. నదుల్లో వేర్వేరు ఉష్ణోగ్రతల కారణంగా వాటి రంగుల్లో తేడా ఉంటుంది. అలాంటి నదులు ఒకాదానితో మరొకటి సంగమించినప్పుడు వి‘చిత్రా’లు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నదీ సంగమాలు చాలానే ఉన్నాయి.


book3.2.jpg

ఒకటి ఎరుపు... మరొకటి పచ్చగా...

అమెరికాలోని కొలరాడోలో ఉన్న రాతి లోయలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ లోయల్లో నుంచి గ్రీన్‌ రివర్‌, కొలరాడో నది ప్రవహిస్తుంటాయి. ఈ రెండు నదుల్లో నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంది. కొలరాడో నది రాకీ పర్వతాలలో పుట్టింది. దీని నీరు ఎరుపు రంగులో కనిపిస్తుంది. గ్రీన్‌ రివర్‌ బురద నీటితో ఉంటుంది. ఈ రెండూ ఉటాలోని కేనియన్‌ నేషనల్‌ పార్కులో కలిసి పెద్ద కొలరాడో నదిగా మారతాయి. అయితే ఈ రెండు నదులు కలిసి ప్రవహించినప్పటికీ వాటి నీళ్లు మాత్రం కలవవు. రెండూ వేర్వేరు రంగుల్లో పారుతున్న దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ రెండు నదుల పాయలు చివరగా పావెల్‌ సరస్సులో కలుస్తాయి.


book3.3.jpg

దేని దారి దానిదే!

వేర్వేరు ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహిస్తూ వచ్చే రెండు నదులు ఒకచోట కలిసి ప్రయాణిస్తాయి. కానీ నా దారి నాది, నీ దారి నీది అన్న చందంగా నీళ్లు కలవకుండానే ప్రవహిస్తుంటాయి. ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. చైనాలోని జియాలింగ్‌, యాంగ్జీ నదుల పాయలు ఛాంగ్‌కింగ్‌ అనే ప్రాంతంలో కలిసి ఒక నదిగా మారతాయి. కానీ వాటి నీళ్లు మాత్రం కలవవు. రెండు వేర్వేరు రంగుల్లో ప్రయాణిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. జియాలింగ్‌ నదిలో నీళ్లు తేటగా ఉంటాయి. అదే సమయంలో యాంగ్జీ నదిలో నీళ్లు మురికిగా కనిపిస్తాయి. వర్షపాతం, భిన్నమైన అవక్షేపాల కలయిక వల్ల నదీ జలాలు ఆయా రంగుల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండు నదులు కలిసే ఛాంగ్‌కింగ్‌ ప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ ప్రాంతం రవాణా, వాణిజ్యానికి ముఖ్యమైనది.


book3.7.jpg

దేవ్‌ప్రయాగ్‌లో గంగ...

భారతదేశంలో అతి ముఖ్యమైన, పవిత్రమైన నదులలో గంగానది ఒకటి. గంగా నదీ తీరం ఆధ్యాత్మికతకు, పుణ్యక్షేత్రాలకు నిలయం. హిమాలయ పర్వత సాణువుల్లో పుట్టి ప్రవహించే అలకనంద, భాగీరథి నదులు దేవ్‌ప్రయాగ్‌లో కలిసి గంగా నదిగా మారతాయి. దేవ్‌ప్రయాగ్‌లో రాముడు, దశరథ మహారాజు తపస్సు చేశారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడున్న రఘునాథ్‌జీ ఆలయాన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఛార్‌దామ్‌ యాత్ర చేసే భక్తులు ఈ మార్గం నుంచే వెళుతుంటారు. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నదులు కలిసే చోట భక్తులు పవిత్రస్నానాలు చేస్తుంటారు. భాగీరఽథి నదిపై కుండ్‌ని బ్రహ్మకుండ్‌ అని, అలకనంద కుండ్‌ని వశిష్ఠకుండ్‌ అని, మూడవ కుండ్‌ని సూర్యకుండ్‌ అని పిలుస్తుంటారు. భాగీరథి హిమాలయాల్లోని గోముఖ్‌ గ్లేసియర్‌ దగ్గర ఉద్భవిస్తే, అలకనంద సత్పతి గ్లేసియర్‌ దగ్గర మొదలవుతుంది.


ఆకాశం నుంచి చూస్తే...

రెండు నదులు ఒకచోట కలుస్తాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం కలవవు. అలా కొన్ని కిలోమీటర్ల మేర శత్రువులం అన్నట్టుగా ప్రవహిస్తాయి. ఈ దృశ్యం బ్రెజిల్‌లో కనిపిస్తుంది. ఆ నదులు రియో నీగ్రో, సొలిమోస్‌. రియో నీగ్రో నదికి ‘బ్లాక్‌ రివర్‌’ అని పేరుంది. ఇది కొలంబియన్‌ హిల్స్‌లో పుట్టి అడవులగుండా ప్రయాణిస్తుంది. ఈ నదిలో నీళ్లు టీ రంగులో ఉంటాయి. అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లోని కుళ్లిన ఆకులు, కొన్ని రకాల మొక్కల వల్ల నీటికి ఆ రంగు వచ్చిందని అంటారు. ఈ నదిలో నీరు 28 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. నదీ ప్రవాహం గంటకు 2 కి.మీ.గా ఉంటుంది.


సొలిమోస్‌కి ‘అమెజాన్‌ రివర్‌’ అని పేరు. పెరూలోని ఆండిస్‌ పర్వతాలలో పుట్టిన ఈ నది ఇసుక, ఒండ్రు మట్టి, బురద వల్ల నీళ్లు బురదతో కూడి గోధుమరంగులో కనిపిస్తాయి. ఈ నదిలో నీరు 22 డిగ్రీల సెల్సియస్‌ ఉషోగ్ర తతో ఉంటాయి. గంటకు 6 కి.మీ వేగంతో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు నదులు వేర్వేరు రంగుల్లో కలిసిపోకుండా ప్రయాణించడాన్ని విశ్వం నుంచి స్పష్టంగా చూడొచ్చని ‘నాసా ఎర్త్‌ అబ్జర్వేటరీ’ చెబుతోంది. ఈ రెండు నదుల్లో నీళ్లు కలవకపోవడానికి కారణం అవి ప్రవహించే వేగంలో తేడా, ఉష్ణోగ్రతలో తేడాలేనట. సొలిమోస్‌ నదిలో నీళ్లు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. ఈ అంశాలన్నీ నీళ్లు కలవకుండా ఉండటానికి కారణమవుతున్నాయి.


book3.8.jpg

స్వచ్ఛమైన నీరు... బురద నీరు..

రోన్‌ నది స్విస్‌ ఆల్ఫ్స్‌ పర్వతాల్లో పుట్టి స్వచ్ఛమైన నీలిరంగుతో కనువిందు చేసేలా ఉంటుంది. రోన్‌ నదికి ఉపనది అయినటువంటి అర్వ్‌ నది గ్రేయన్‌ ఆల్ఫ్స్‌లో పుట్టి 108 కి.మీ. ప్రయాణిస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఈ నది ప్రయాణించే దూరం 9 కిమీ. అయితే ఈ నదిలో నీరు బురదగా కనిపిస్తుంది. ఈ రెండు నదులు జెనీవా దగ్గర కలుస్తాయి. కలుస్తాయన్న మాటే కానీ నీళ్లు మాత్రం కలవవు. నీలి రంగు నీళ్లు, బురద నీరు వేర్వేరుగా ప్రవహించడాన్ని స్పష్టంగా చూడొచ్చు. రోన్‌ నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటే, అర్వ్‌ నది నీళ్లు బురదమయం.


జర్మన్‌ కార్నర్‌...

మోసెల్లె, రైన్‌... జర్మనీలో ఉన్న రెండు ప్రముఖ నదులు ఇవి. జర్మనీలోని కొంబ్లెజ్‌ నగరంలో ఈ నదులు రెండూ కలుస్తాయి. నీళ్లలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి లేత నీలం రంగులో ఉంటే, మరొక నది నీరు ముదురు నీలం రంగులో ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక వైన్‌ ఉత్పత్తి అయ్యేది ఇక్కడే. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రెండు నదులు కలిసే ప్రాంతాన్ని ‘జర్మన్‌ కార్నర్‌’ అని పిలుస్తారు. మోసెల్లె నది ఫ్రాన్స్‌లోని పర్వతాల్లో పుట్టి 544 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ నది జర్మనీలో ప్రవహించే ప్రాంతంలో వైన్‌ తయారీకి పనికొచ్చే నాణ్యమైన రైజిలింగ్‌ గ్రేప్స్‌ పండుతాయి. రైన్‌ నది జలరవాణాకు ఉపయోగపడుతోంది. ఈ నదీ తీరం వెంట ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది.


గుణాలే కారణం

రిపబ్లిక్‌ ఆఫ్‌ అడిజియాలో ప్రవహించే రెండు నదులు కిషా, బెలాయా... కొద్దిదూరం కలిసి ప్రవహించినా, వాటి నీటి గుణాల వల్ల నీళ్లు కలవవు. అయితే కొన్ని కి.మీ మేర ప్రవహించిన తరువాత రెండు నదుల్లోని నీరు పూర్తిగా కలిసిపోతుంది. రెండు నదుల్లో నీరు త్వరగా కలవకపోవడానికి భౌతిక, రసాయన గుణాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి ఉష్ణోగ్రతలు, నీళ్లలో కరిగిన సాలిడ్స్‌, మినరల్స్‌ వంటివి కూడా కారణం.. కిషా నది పర్వతాల మీదుగా గ్లేసియర్స్‌లో నుంచి వస్తుంది. కాబట్టి నీరు లేత రంగులో ఉంటుంది. బెలాయా నది ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. రెండు నదుల్లో నీళ్లు నెమ్మదిగా ఒకదానిలో మరొకటి కలవడం విశేషం.


బ్లాక్‌ అండ్‌ వైట్‌...

ఒకటి తెల్లనది, మరొకటి నల్లనది. రెండూ కలిసి ప్రవహిస్తాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం కలవవు. జార్జియాలోని వైట్‌ అరగ్వి, బ్లాక్‌ అరగ్వి నదుల తీరు ఇది. ఖనిజాలు, రసాయనాలు, ఉష్ణోగ్రతలు వంటి కారణాల వల్ల నదిలో నీళ్లు కలవకుండానే చాలా దూరం ప్రయాణిస్తాయి. లైమ్‌స్టోన్‌, ఖనిజాల కలయిక వల్ల వైట్‌ అరగ్వి తెల్లగా, సిల్ట్‌, సేంద్రియ పదార్థాల కలయిక వల్ల బ్లాక్‌ అరగ్వి నల్లగా కనిపిస్తాయి. రెండునదులు కలవకుండా ప్రవహించే దృశ్యం జ్వారి మోనాస్టరీ నుంచి స్పష్టంగా చూడొచ్చు. ఈ రెండు నదుల్లోని నీరు చివరగా పసనౌరి దగ్గర కలిసిపోయి ఒకే నదిగా ప్రవహిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

చుక్కలు చూపిస్తున్న ఇండిగో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2025 | 09:33 AM