Share News

Vishnuvardhan Memorial: స్థల వివాదం.. స్టార్ హీరో సమాధి తొలగింపు..

ABN , Publish Date - Aug 11 , 2025 | 07:19 AM

Vishnuvardhan Memorial: ఆ సమాధిని తొలగించడానికి బాలకృష్ణ ఫ్యామిలీ సన్నాహాలు మొదలెట్టింది. దీంతో విష్ణువర్థన్ ఫ్యాన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు 2023లో బాలకృష్ణ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

Vishnuvardhan Memorial: స్థల వివాదం.. స్టార్ హీరో సమాధి తొలగింపు..
Vishnuvardhan Memorial

దివంగత స్టార్ హీరో విష్ణువర్ధన్ సమాధి తొలగింపు ఘటన కన్నడ నాట సంచలనానికి తెరతీసింది. స్థలం గొడవ నేపథ్యంలో విష్ణువర్ధన్ సమాధి తొలగించడాన్ని సినీ ప్రముఖులతో పాటు సామాన్య జనం కూడా తప్పుబడుతున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. విష్ణువర్ధన్ సమాధి నిర్మించిన స్థలం ప్రముఖ కన్నడ నటుడు బాలకృష్ణది. ఆయన ఆ స్థలాన్ని ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందారు. దాదాపు 50 ఏళ్ల క్రితం బాలకృష్ణ స్టూడియో కట్టడానికి స్థలం కావాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.


ప్రభుత్వం బెంగళూరులో 20 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ 20 ఎకరాల్లో ఆయన ‘అభిమాన్ స్టూడియో’ కట్టారు. ప్రస్తుతం ఆ 20 ఎకరాల్లో పది ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 2009 డిసెంబర్ 30వ తేదీన విష్ణువర్ధన్ చనిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి విష్ణువర్ధన్ అల్లుడు అనిరుధ్‌కు ఫోన్ చేశారు. అంత్యక్రియలు ఎక్కడ చేస్తున్నారని అడిగారు. రుద్రభూమిలో అంత్యక్రియలు చేస్తున్నట్లు అనిరుధ్‌ చెప్పారు. అయితే, ఇందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు.


అభిమాన్ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ఆయన అన్నాడు. ఇందుకు అనిరుధ్ ఒప్పుకున్నాడు. అభిమాన్ స్టూడియోలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు జరిగిన చోట ఆయన సమాధి నిర్మించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. అభిమాన్ స్టూడియో స్థలం విషయంలో బాలకృష్ణ కుటుంబసభ్యుల మధ్య గొడవలు నడుస్తున్నాయి. విష్ణువర్ధన్ చనిపోవడానికి 5 సంవత్సరాల ముందు 2004లో బాలకృష్ణ కూతురు గీత కోర్టులో కేసు వేసింది. ఆ 10 ఎకరాల్లో తనకు కూడా వాటా కావాలని డిమాండ్ చేసింది.


అప్పటినుంచి ఆ కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు కేసులో ఉన్న స్థలంలో సమాధి నిర్మించటంతో గొడవ మొదలైంది. ఆ సమాధిని తొలగించడానికి బాలకృష్ణ ఫ్యామిలీ సన్నాహాలు మొదలెట్టింది. దీంతో విష్ణువర్థన్ ఫ్యాన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు 2023లో బాలకృష్ణ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అది ఫ్యాన్స్‌కు సంబంధం లేని విషయమని కోర్టు అంది. ఏదైనా ఉంటే బాలకృష్ణ, విష్ణువర్ధన్ ఫ్యామిలీలు చూసుకుంటాయని తేల్చి చెప్పింది. విష్ణువర్ధన్ ఫ్యామిలీ దీనిపై ఆసక్తి చూపకపోవటంతో.. తాజాగా, ఆయన సమాధిని కూల్చేశారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. 1995లో బాలకృష్ణ చనిపోయిన తర్వాత ఆయన సమాధిని కూడా అక్కడే నిర్మించారు. బాలకృష్ణ సమాధిని, దానితో పాటు ఓ గుడిని కూడా కూల్చేశారు.


ఇవి కూడా చదవండి

నువ్వా నేనా.. పులివెందులలో టీడీపీ VS వైసీపీ వార్

ఆ కుక్క మనసు ఎంత గొప్పది.. చిన్న పిల్లలను కాపాడడానికి ఎలా పరిగెత్తిందో చూడండి..

Updated Date - Aug 11 , 2025 | 07:53 AM