Villagers Steal Asphalt: బరితెగించారు.. ఇలా రోడ్డు వేస్తే.. అలా తవ్వుకొళ్లారు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:40 AM
బీహార్‌లోని ఓ గ్రామంలో తాజాగా డాంబర్ రోడ్డు వేశారు. వేసి గంటలు కూడా కాకముందే జనం రెచ్చిపోయారు. పారలతో రోడ్డును తవ్వి, తట్టల్లో తారు నింపుకుని వెళ్లిపోయారు.
సాధారణంగా ఏ ఊర్లోనైనా కొత్తగా రోడ్డు వేస్తే జనం సంతోషిస్తారు. కానీ, బీహార్‌లోని కొన్ని ఊర్లలో మాత్రం కొత్తగా రోడ్డు వేస్తే జనం సంతోషించటం మాత్రమే కాదు.. ఆ సంతోషంలో రోడ్డును తవ్వి తీసుకెళ్లిపోతారు. జనం కొత్తగా వేసిన రోడ్డు ఏదైనా సరే తవ్వి తీసుకెళ్లిపోవటం బీహార్‌లోని కొన్ని గ్రామాల్లో కామన్‌గా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జెహానాబాద్ జిల్లాలోని ఔడాన్ బిగ్హా గ్రామంలో సిమెంట్ రోడ్డు వేస్తూ ఉన్నారు. ఓ వైపు కూలీలు రోడ్డు వేస్తుంటే.. మరో వైపు జనం కాంక్రీట్‌ను తట్టల్లో నింపుకుని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది.
ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని ఓ గ్రామంలో తాజాగా డాంబర్ రోడ్డు వేశారు. వేసి గంటలు కూడా కాకముందే జనం రెచ్చిపోయారు. పారలతో రోడ్డును తవ్వి, తట్టల్లో తారు నింపుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. కొత్తగా వేసిన రోడ్డుపై దాదాపు 20 దాకా జనం చేరారు. ఆడవాళ్లు, మగవాళ్లు అన్న తేడా లేకుండా తట్టల్లో తారును నింపుకుని వెళ్లిపోతున్నారు.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘జనాలు రోడ్లు సరిగా లేక అల్లాడుతున్నారు. యాక్సిడెంట్లు అయి చస్తున్నారు. అయినా వీళ్లకు బుద్ధిరావటం లేదు’..‘బీహార్‌లో ఇలాంటివి సర్వ సాధారణం. అందుకే ఆ రాష్ట్రం అంత వెనుక బడి ఉంది’..‘మొన్న సిమెంట్ రోడ్డు తవ్వుకెళ్లిపోయారు. ఇప్పుడు తారు రోడ్డు తవ్వుకెళ్లిపోయారు. అక్కడి ప్రభుత్వం రోడ్లు వేయటం కంటే ఊరికే ఉండటం మంచిది. డబ్బులన్నా మిగులుతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉదయం 30 నిమిషాలు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రోహిత్ శర్మ షాకింగ్ వెయిట్‌లాస్.. 95 నుంచి 75 కిలోలకు.. ఫాలో అయిన డైట్ ఇదే..