Vande Bharat - Civic Sense: వందేభారత్ రైల్లో ప్రయాణికుడి అరాచకం.. నెట్టింట వెల్లువెత్తుతున్న విమర్శలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:49 PM
వందేభారత్‌లో ప్రయాణించిన ఓ వ్యక్తి రైల్లోనే ఉమ్మేసిన ఘటన తాలూకు ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇలాంటి వాళ్ల వల్ల దేశం పరువుపోతోందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొందరు మాత్రం మారటం లేదు. కనీస పౌర స్పృహ లేకుండా వ్యవహరిస్తూ పక్క వారికి తలనొప్పి తెస్తున్నారు. భారతీయులకు సివిక్ సెన్స్ లేదనే అపప్రథకు కారణమవుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి ఉదంతాలు వైరల్ అవుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా మరో షాకింగ్ ఘటన నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. వందేభారత్ రైల్లో ఓ ప్రయాణికుడి నిర్వాకం గురించి తెలిసి అతడిని తెగ తిట్టిపోస్తున్నారు (Vande Bharat passenger spitting).
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వందేభారత్‌లో గత గురువారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. జల్‌పాయ్‌గురి జంక్షన్ నుంచి హౌరా వరకూ బయలుదేరిన ఓ ప్రయాణికుడు ఆ రైలు తన సొంత ఇల్లు అన్నట్టు రెచ్చిపోయాడు. అతడి తీరు చూసి తట్టుకోలేకపోయిన మరో ప్రయాణికుడు ఈ ఉదంతాన్ని ఫొటోలతో సహా పంచుకుంటూ అతడిని దుమ్ముదులిపేశాడు (Vande Bharat viral incident).
‘నా ముందు సీటులో కూర్చొన్న వ్యక్తి రైలంతా తన సొంత ఇల్లు అన్నట్టు రెచ్చిపోయాడు. ఏదో నములుతూ రైల్లోనే ఉమ్మేశాడు. నేను అతడిని ప్రశ్నిస్తే అతను లక్ష్య పెట్టలేదు. మరోసారి ఇలాగే రైల్లో సీట్ల మధ్య ఉమ్మేయబోతుంటే నేను మళ్లీ వద్దని వారించాడు. అతడు వినకపోగా నా సీటు పక్కనే ఉమ్మేశాడు. రైల్వే సర్వీసుల్లో నాణ్యత పెరుగుతున్నా ఇలాంటి వాళ్ల వల్ల ఇతర ప్రయాణికులకు చేదు అనుభవం మిగులుతోంది’ అని చెప్పాడు ( train passenger misbehavior).
ఇక సదరు ప్రయాణికుడు షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు మండిపడ్డారు. టిక్కెట్ కొనడమంటే రైలు మొత్తాన్ని కొనడమనే భ్రమలో ఉండే వాళ్ల మధ్యన మనం బతుకుతున్నాం అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. షేర్ క్యాబ్‌లో ప్రయాణించిన తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని మరో వ్యక్తి చెప్పారు. క్యాబ్‌లో మేకప్ తీసిన ఓ మహిళ తను వాడిన టిష్యూలను క్యాబ్‌లోనే పడేసి చెత్త చేసిందని చెప్పారు.
ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదని మరో వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన సొసైటీ ఇలాంటి వాళ్లతో నిండిపోయిందని, సర్దుకుపోవడం మినహా చేసేదేమీ లేదని కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
కుర్కురేలో పామోలిన్ అంటూ వినియోగదారుడి ఆరోపణ.. పెప్సీకో ఏమందంటే..
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు