Billionaire's Mind: బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:54 PM
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణాలను ఓ న్యూరాలజిస్టు తాజాగా వివరించారు. అపరకుబేరుల మెదడు పనితీరు ఇతరులకంటే ఎలా భిన్నంగా ఉంటుందో విడమరిచి చెప్పారు. ప్రస్తుతం ఈ టాపిక్ జనాలకు బాగా నచ్చి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బిలియనీర్‌లు, సామాన్యుల మధ్య తేడా ఏమిటి? అంతటి సక్సెస్ వెనకున్న ఫార్ములా ఏమిటీ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఎందరో ప్రయత్నించారు. అయితే, ఓ న్యూరాలజిస్టు తాజాగా ఈ అంశానికి మరో కోణం జోడించే ప్రయత్నం చేశారు. లిమిట్‌లెస్ బ్రెయిన్ ల్యాబ్ సంస్థ వ్యవస్థాపకురాలు, న్యూరాలజిస్టు డా. శ్వేత అదాటియా.. ఓ పాడ్‌కాస్ట్‌లో బిలియనీర్‌ల ఆలోచనా ధోరణికి, విజయాలకు గల కారణాలను వివరించారు (Billionaire Brain Science).
‘జన్యు కారణాలతో పాటు బిలియనీర్‌లు పెరిగిన వాతావరణం వారి పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ రెండింటి సమాహారం వారి మెదడును దూసుకుపోయేలా చేస్తుంది. మొదటి నుంచీ చురుగ్గా ఉండే వారు జీవితంలో ఎక్కువగా విజయం సాధిస్తారు. ఏకాగ్రత, లక్ష్యంపై స్పష్టత, దార్శనికత, ప్రణాళిక.. విజయం సాధించేందుకు ఇవి ప్రధాన కారణాలు. వీటితో పాటు న్యూరో మానిఫెస్టేషన్ కూడా ఓ ముఖ్య కారణం. కావాల్సిన వాటిని పదే పదే మననం చేసుకుంటే వాటిని సాధించేందుకు మనసు, మెదడు సిద్ధం అవుతాయి. తుదకు లక్ష్యాన్ని చేరుకుంటారు’ అని డా.శ్వేత అన్నారు.
‘మెదడులో భాగమైన ఫ్రాంటల్ కార్టెక్స్ బిలియనీర్‌లల్లో మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది. బిలియనీర్‌లు ఎంతటి సవాళ్లనైనా అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పనిపై ఏకాగ్రత సాధించేందుకు భావోద్వేగాలపై నియంత్రణ కూడా అవసరం. ప్రతి విషయంపైనా అతిగా ఆలోచించి భావోద్వేగానికి లోను కాకూడదు. ఉన్నదానితో సంతృప్తి పడితే ఎదుగుదల ఉండదు. సంతృప్తికి ఆవల అవకాశాలు, అభివృద్ధి ఉంటాయి. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం, సంతృప్తి చెందడం మూర్ఖత్వమే అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఓపెన్‌ఏఐలో భారతీయ యువకుడికి ఊహించని ఆఫర్.. నెలకు రూ.20 లక్షల శాలరీ
డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్