UP Bus Horror: బస్సులో అలజడి.. సుత్తెతో ప్రయాణికులపై దాడి చేసిన సైకో..
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:50 AM
బస్సులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయంతో అటు, ఇటు పరుగులు తీయటం మొదలెట్టారు. రాము ప్రసాద్ దాడిలో గాయపడ్డ వారు చావు కేకలు పెట్టడం మొదలెట్టారు.
ఆర్టీసీ బస్సులో ఓ సైకో అలజడి సృష్టించాడు. సుత్తెతో ప్రయాణికులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బస్ రన్నింగ్‌లో ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. సైకో దాడిలో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్ అయోధ్య నుంచి గోరఖ్‌పూర్ వెళుతూ ఉంది. రాము ప్రసాద్ అనే 48 ఏళ్ల వ్యక్తి అదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతడు బస్ టూల్ బాక్స్ దగ్గరకు వెళ్లి అందులోంచి సుత్తెను బయటకు తీశాడు.
అనంతరం బస్సులోని తోటి ప్రయాణికులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో బస్సులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయంతో అటు, ఇటు పరుగులు తీయటం మొదలెట్టారు. రాము ప్రసాద్ దాడిలో గాయపడ్డ వారు చావు కేకలు పెట్టడం మొదలెట్టారు. డ్రైవర్‌కు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. విషయం అర్థం అవ్వగానే వెంటనే బస్ ఆపేశాడు. రాము ప్రసాద్ బస్సులోని చాలా మందిపై దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది ప్రయాణికులు ధైర్యం చేసి అతడ్ని ఎదురించారు.
అతడి చేతుల్లోంచి సుత్తెను లాక్కుని బంధించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్ దగ్గరకు చేరుకున్న పోలీసులు రాము ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతడి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. పోలీసులు రాము ప్రసాద్ కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రాము ప్రసాద్‌ను వెంట పంపించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రాము ప్రసాద్ కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని ఆస్పత్రిలో చేర్పించాలని, బయటకు వెళ్లనివ్వకూడదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ అదే పాట.. ఇండియా, పాక్ యుద్ధాన్ని వాడేసుకుంటున్న ట్రంప్..
నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..