Eagle Strike Injures Loco Pilot: రైలును ఢీకొన్న గద్ద.. లోకో పైలట్‌కు గాయాలు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:18 PM
బారాముళ్లా నుంచి బనిహాల్ వెళుతున్న రైలును గద్ద ఢీకొంది. దీంతో లోకో పైలట్‌కు గాయాలు అయ్యాయి. అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రన్నింగ్‌లో ఉన్న రైలును గద్ద ఢీకొట్టిన ఘటనలో లోకో పైలట్‌కు గాయాలు అయ్యాయి. రైలు ప్రయాణిస్తున్న మార్గంలో కొన్ని గంటల పాటు సర్వీసులు ఆగిపోయాయి. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం 74626 నెంబర్ రైలు బారాముళ్లా నుంచి బనిహాల్ వెళుతోంది. అనంత్‌నాగ్ దగ్గర ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ పెద్ద గద్ద వేగంగా వచ్చి ఇంజిన్ విండ్‌షీల్డ్‌ను ఢీకొట్టింది. దీంతో లోకో పైలట్ సీహెచ్ విశాల్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
అయినా కూడా అతడు రైలును ఆపలేదు. నేరుగా అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ వైద్యం చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ రైలు అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. అధికారులు సేఫ్టీ చెక్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మార్గంలో పాక్షికంగా రైళ్ల రాకపోకల్ని తగ్గించారు. కాగా, అనంత్‌నాగ్ మార్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం ఇదే మొదటి సారి కావటం గమనార్హం.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రైలు ఇంజిన్ విండ్‌షీల్డ్ బద్ధలై పోయి ఉంది. గద్ద ఇంజిన్ లోపల పడిపోయింది. లోకో పైలట్ విశాల్ ముఖానికి గాయాలు అయి రక్తం కారుతూ ఉంది. గద్ద కూడా గాయపడింది. అది పైకి ఎగరలేకపోతూ ఉంది.
ఇవి కూడా చదవండి
అంతరిక్షంలో ఎంత అరిచినా వినిపించదా.. ఎందుకలా.?
చిన్న ముక్క తింటే.. ఈ వ్యాధులు దూరం