Space Science Facts: అంతరిక్షంలో ఎంత అరిచినా వినిపించదా.. ఎందుకలా.?
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:59 PM
అంతరిక్షం అంటే అదో మాయా ప్రపంచం.! అక్కడి పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అక్కడ ఎంత బిగ్గరగా అరిచినా వినిపించదు. ఇంతకీ ఎందుకలా జరుగుతుంది. దీని వెనకున్న శాస్త్రీయ కారణమేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష వాతావరణం భూ ఆవాసానికి పూర్తి భిన్నంగా ఉంటుందని ఎందరో పరిశోధకులు తేల్చారు. అక్కడ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా వీలుండదు. ఎంత అరిచినా గొంతెండుకు పోవాల్సిందే గానీ ఎదుటివారు ఏం చెప్తున్నారో మాత్రం వినపడదు. మాటలే కాదు ఎలాంటి శబ్దాన్నీ వినలేమని, అక్కడి వాతావరణానికి మాట్లాడేవారి గొంతు దెబ్బతింటుందని.. దానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఎందుకు వినిపించదంటే?
అంతరిక్షం ఒక శూన్యం. అంటే ధ్వని తరంగాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించేందుకు గాలి వంటి ఎలాంటి కణాలూ ఉండవు. భూమిపై.. కంపనాల వల్ల ధ్వని తరంగాలు ప్రయాణిస్తుంటాయి. దీని వల్ల ఎదుటి వారికి శబ్దం వినిపిస్తుంది. కానీ అంతరిక్షంలో అలాంటి ప్రక్రియకు అవకాశముండదు. అంతరిక్షంలో అరవడం వల్ల ఎముకలు, కణజాలాలు అంతర్గతంగా ధ్వనిని ప్రసరింప జేస్తాయి, కనుక అంతర్గతంగా వినిపిస్తుంది. కానీ అక్కడ బయట తరంగాలు ఉండవు. కాబట్టి దానిని ఎవరూ వినలేరు. అంతరిక్షంలో చెవులు మూసుకుని ఏదైనా శబ్దం చేస్తే.. కంపనాలు నేరుగా ఎముకల ద్వారా ప్రయాణించి మెదడును చేరతాయి. ఇదంతా శరీర అంతర్గత వ్యవస్థలో భాగమై ఉంటుంది. కాబట్టి అంతరిక్షంలోనూ ఈ సూత్రం పనిచేస్తుంది.
ధ్వని ఎలా ప్రయాణిస్తుంది?
ధ్వని దానంతట అదే ప్రయాణించదు. అది ఒక కణం నుంచి మరో కణానికి శక్తిని పంపడం ద్వారా ప్రయాణిస్తుంది. స్వర తంతువుల కంపనాలు గాలి కంపనానికి కారణమవుతాయి. ఇవి చెవికి చేరడం ద్వారా వినికిడి కలుగుతుంది. భూ ఆవాసంపై గాలి కొన్ని బిలియన్ల కణాలతో నిండి ఉంటుంది. ఇవి స్వర తంతువులకు కంపనాలను ప్రసారం చేస్తాయి. ఈ తరంగాలు కర్ణభేరిని చేరుకుని, తద్వారా వినికిడి అనుభూతిని సృష్టిస్తాయి.
ఇవి కూడా చదవండి:
మద్యం సేవించి ట్రాక్టర్ కింద పడుకున్నాడు.. తెల్లారేసరికి ఘోరం
రూ.60,799 కోట్లతో కొత్త రోడ్లు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్