Share News

Worlds Most Venomous Octopus: బతకాలని లేదా?.. చావును చేతుల్లో పట్టుకున్నావేంటి బాబు..

ABN , Publish Date - Dec 17 , 2025 | 08:49 AM

ఓ పర్యాటకుడు అత్యంత విషపూరితమైన బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌ను చేత్తో పట్టుకున్నాడు. నీటిలో వెళుతున్న దానితో ఆటలాడాడు. అదృష్టం బాగుండి అది అతడ్ని ఏమీ చేయలేదు. లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి.

Worlds Most Venomous Octopus: బతకాలని లేదా?.. చావును చేతుల్లో పట్టుకున్నావేంటి బాబు..
Worlds Most Venomous Octopus

ఈ ప్రకృతి ఎన్నో ప్రమాదకరమైన జీవులకు నిలయం. ఎంతో అందంగా.. అమాయకంగా కనిపించే జీవులు క్షణాల్లో మన ప్రాణాలు తీయగలవని మనం ఊహించను కూడా ఊహించలేము. సాధారణంగా అన్ని రకాల ఆక్టోపస్‌లు విషపూరితాలు. అయితే, వాటి వల్ల మనుషుల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఉండదు. అందుకే మనుషులు వాటిని పెద్ద ఎత్తున తినేస్తున్నారు. స్పెయిన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా దేశాల్లో ఆక్టోపస్‌లను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ, ఆక్టోపస్‌‌లలో అత్యంత ప్రమాదకరమైన జాతి ఒకటి ఉంది. ఆ జాతి ఆక్టోపస్‌ మనల్ని కరిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.


దాని పేరు బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. అత్యంత ప్రమాదకరమైన ఈ బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌ను ఓ పర్యాటకుడు చేత్తో పట్టుకున్నాడు. నీటిలో వెళుతున్న దానితో ఆటలాడాడు. అదృష్టం బాగుండి అది అతడ్ని ఏమీ చేయలేదు. లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిలిప్పీన్స్‌లో పర్యటించడానికి వెళ్లాడు. సముద్రం దగ్గర ఈత కొడుతున్న సమయంలో అతడికి ఓ చిన్న అందమైన ఆక్టోపస్ పిల్ల కనిపించింది. అంతే.. అతడు దాన్ని పట్టుకున్నాడు. చేతుల్లోకి తీసుకుని మళ్లీ నీటిలోకి వదిలేశాడు. దానితో కొన్ని క్షణాలు ఆటలాడాడు.


అయితే, ఆ వ్యక్తికి ఆ చిన్న ఆక్టోపస్ పిల్ల ఎంత ప్రమాదమో తెలీదు. అది కుడితే న్యూరోటాక్సిన్స్ శరీరంలోకి వెళ్లి నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఆ విషయం తెలీక చాలా సేపు దాన్ని చేతుల్లో పట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చావును చేతిలో పట్టుకున్నావు. జాగ్రత్త బ్రదర్’..‘అది బేబీ ఆక్టోపస్ కాదురా బాబు. దాన్ని పట్టుకుని కూడా నువ్వు ఎలా ప్రాణాలతో ఉన్నావు’.. ‘ఈ సృష్టిలో అత్యంత విషపూరితమైన జీవి అదే. దానితో ఆటలు ఆడుతున్నావా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

శీతాకాలంలో ఇమ్యూనిటీ పెంచే అద్భుత పానీయం

మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!

Updated Date - Dec 17 , 2025 | 10:36 AM