Swiggy 2025 Trends: బిర్యానీ క్రేజ్.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు !
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:36 PM
2025లో బిర్యానీ పిచ్చి మాములుగా లేదు. నిమిషానికి సుమారు 200 ఆర్డర్లతో స్విగ్గీలో రికార్డు స్థాయి ట్రెండ్‌ను సృష్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: 2025లో మన వాళ్ళకు బిర్యానీ పిచ్చి మాములుగా లేదు.. స్విగ్గీలో నిమిషానికి ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలిస్తే అవాక్కవుతారు! స్విగ్గీ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి నిమిషం సగటున 194 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బర్గర్లు (4.42 కోట్లు), పిజ్జాలు (4.01 కోట్లు), వెజ్ దోశలు (2.62 కోట్లు) వంటి వంటకాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాత్రి భోజనం సమయంలో ఆర్డర్లు ఎక్కువగా రావడం గమనార్హం. మధ్యాహ్నం కన్నా రాత్రి 8 గంటల తర్వాత ఫుడ్ ఆర్డర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ప్రాంతీయ వంటకాలకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. రాజస్థానీ, మాల్వానీ వంటకాలు ఈ ఏడాదిలో రెట్టింపు ఆర్డర్లు రాబట్టాయి. అంతేకాదు, మెక్సికన్ (1.6 కోట్లు), టిబెటన్ (1.2 కోట్లు), కొరియన్ (47 లక్షలు) వంటకాలకు కూడా మంచి డిమాండ్ ఉంది.
ప్రత్యేక ఆర్డర్లు..
హైదరాబాద్‌లో ఒక వినియోగదారుడు 47,000 రూపాయల విలువైన 65 బాక్స్ డ్రై ఫ్రూట్ బిస్కట్లు ఆర్డర్ చేసి వార్తల్లో నిలిచారు. ముంబైలో మరో వినియోగదారుడు 2025లో రోజుకు సగటున 9 సార్లు ఫుడ్ ఆర్డర్ చేశాడు. ప్రధాన భోజనం మాత్రమే కాదు, రాత్రి 10 గంటల తర్వాత ఐస్‌క్రీమ్‌లు, కేకులు, గులాబ్ జామ్ వంటి స్వీట్లు ఎక్కువగా ఆర్డర్ అయ్యాయి. డెజర్ట్ విభాగం గతేడాదితో పోలిస్తే 25% పెరిగింది. పని ఒత్తిడిలో ఉన్నవారు ఇన్స్టంట్ కాఫీ, టీ ఆర్డర్ చేస్తుండగా, ఆరోగ్యాన్ని కాపాడాలనుకునేవారు సలాడ్లు, జ్యూస్‌లను ఎక్కువగా ఎంచుకున్నారు.
మ్యాచ్‌ల వేళల్లో ఆర్డర్లు..
క్రికెట్ మ్యాచ్‌లు, దీపావళి, కొత్త సంవత్సరం వంటి వేళల్లో స్విగ్గీ యాప్ రికార్డు స్థాయి ఆర్డర్లు అందుకుంది. ప్రతి సెకనుకు వందల సంఖ్యలో చిప్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ డెలివరీ అయ్యాయి. ఇన్‌స్టామార్ట్ ద్వారా నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలను నిమిషాల్లో ఆర్డర్ చేయడం మెట్రో నగరాల్లో భారీగా పెరిగింది. 2025లో భారతీయులు తమ ఆకలి తీర్చడానికి ఫుడ్ ఆర్డర్లలో అత్యధికంగా బిర్యానీ, బర్గర్, పిజ్జా మరియు డెజర్ట్స్‌ను ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల ఆకలి తీర్చడానికి డెలివరీ భాగస్వాములు ముఖ్య పాత్ర పోషించారు.