Sweaters for Elephants: మానవత్వం అంటే ఇదీ.. ఏనుగులు చలికి తట్టుకోలేకపోతున్నాయని..
ABN , Publish Date - Jan 24 , 2025 | 07:34 PM
చలికి తట్టుకోలేక వణికిపోతున్న ఏనుగులకు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ సంస్థ వారు స్వెట్టర్లు తొడుగుతున్నారు. ఇందుకు కోసం స్థానిక గ్రామాల్లోని మహిళలు స్వెట్టర్లు కూడా అల్లి ఇస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలం అంటే మనుషులతో పాటు భారీ ఏనుగులు కూడా గజగజా వణికిపోవాల్సిందే. ఇక మనుషులంటే తెలివి నేర్చిన వారు కాబట్టి తమ కష్టాలకు ఏదో రకంగా పరిష్కారాలు కనుక్కుంటారు. కానీ మూగ జీవాలు మాత్రం మౌనంగానే అవస్థలు పడతాయి. తట్టుకోలేక పోతే కన్నుమూస్తాయి. అయితే, ఇలా ఇక్కట్ల పాలయ్యే ఏనుగులకు అండగా నిలుస్తోంది మథురలోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ ఆర్గనైజేషన్. ప్రతి ఏటా వాటి కోసం స్వెట్టర్లను సిద్ధం చేసి వేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వెచ్చని స్వెట్టర్లు వేసుకుని ఏనుగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ (Viral) అవుతున్నాయి (Sweaters for Elephants).
Bill Gates: స్కూలు రోజుల్లో టీచర్‌కు షాకిచ్చిన బిల్ గేట్స్! కబేళా నుంచి ఏకంగా..
ఇలా స్వెట్టర్లు వేసుకునే ఏనుగుల్లో చాలా మటుకు అంగ వైకల్యం కలవి. కొన్ని చూపు కోల్పోతే మరికొన్ని కాళ్లు లేక అవస్థలు పడుతున్నాయి. సర్కస్‌లు, చట్టవ్యతిరేకంగా బంధించడం, అక్రమ రవాణా ముఠాల బారి నుంచి వాటిని కాపాడి ఇక్కడకు తరలించారు. వీటిల్లో అనేకం తమ జీవితమంతా మనుషుల చేతుల్లో చిత్ర హింసలు అనుభవించాయి. అందుకే ఈ కేంద్రం వారు ఏనుగులను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. వాటికి ఏ మాత్రం అసౌకర్యం కలగనీయరు. స్థానికంగా ఉన్న గ్రామీణ మహిళలే వీటికి స్వెట్టర్లు నేస్తారు.
ఒక్కో స్వెట్టర్ సిద్ధం చేసేందుకు నాలుగు కిలోగ్రాముల ఊలు కావాలి. ఏడేనిమిది మంది మహిళలు దాదాపు మూడు వారాల పాటు కష్టపడి వీటిని సిద్ధం చేస్తారు. మొదట్లో ఈ ఏనుగులు స్వెట్టర్లు వేసుకునేందుకు ఇష్టపడేవి కావట. ఒంటిపై ఏదో కుడుతున్నట్టు అనిపించడంతో వాటిని తీసేసేవట. ఇలాంటి ఏనుగులకు తాము స్వెట్టర్లు తొడగమని జంతు సంరక్షకులు తెలిపారు. కొన్ని మాత్రం స్వెట్టర్ వేసుకుని ఎంజాయ్ చేస్తాయని పేర్కొన్నారు.
భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!
ఇదిలా ఉంటే, ఏనుగుల విషయంలో మావటీలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సంప్రదాయిక విధానాల్లో ఏనుగులకు శిక్షణ ఇచ్చేందుకు దాన్ని కొట్టడం, బెదిరించడం చేసేవారని జంతు సంరక్షకులు చెబుతున్నారు. దీని ద్వారా ఏనుగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. ఏనుగులు సంఘ జీవులు, తమ సమూహం నుంచి విడివడితే అవి అస్సలు తట్టుకోలేవట. ఈ నేపథ్యంలో దాన్ని కొట్టి క్రమశిక్షణలో పెట్టడం అంటే ఆ మూగజీవానికి నరకం చూపించినట్టే అని జంతు సంరక్షకులు అంటున్నారు. కాబట్టి ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఆధునిక విధానాలపై మావటీలకు శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.