Share News

క్వారీగుంతనే హోటల్‌గా మార్చారు

ABN , Publish Date - May 18 , 2025 | 12:53 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల హోటళ్లు ఉన్నాయి. కొన్ని బహుళ అంతస్థుల్లో ఉంటే, ఇంకొన్ని విలాసవంతమైనవి. అలాగే సముద్రంలో, శిఖరంపైన... ఇలా రకరకాల హోటళ్లు ఆకట్టుకుంటాయి. కానీ ఒక క్వారీ గుంతలో నిర్మించిన భారీ హోటల్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? దాన్ని చూడాలంటే... చైనాలోని షాంఘైకి సమీపంలో ఉన్న ‘ఎర్త్‌ స్ర్కాపర్‌’కు వెళ్లాల్సిందే... ఈ తొలి అండర్‌ వాటర్‌ క్వారీ హోటల్‌లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

క్వారీగుంతనే హోటల్‌గా మార్చారు

పర్యాటకులను ఆకర్షించాలంటే ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి మరో నిర్మాణం ఉండకూడదు. అప్పుడే అంతా ఆకర్షితులవుతారు. ఇలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘క్వారీ హోటల్‌’. నిర్మాణాల కోసం ఉపయోగించే గ్రానైట్‌, కంకర కోసం... కొండను తవ్వడం, దానిని కంకరగా మార్చడం, గ్రానైట్‌ రాయిని తరలించడం చూస్తూనే ఉంటాం.

అలా తవ్విన చోట ఏర్పడిన భారీ గుంతలను ‘క్వారీ’లంటారు. కాలక్రమంలో అలాంటి క్వారీలు వర్షపు నీటితో చెరువుల్లా మారతాయి. దేశమేదైనా నగర శివారుల్లో చాలా చోట్ల అలాంటి పాడుబడిన క్వారీలు దర్శనమిస్తుంటాయి. తవ్వకాలు పూర్తయిన క్వారీలు ఎందుకు పనికిరావు అనుకుంటాం. కానీ చైనాలోని షాంఘైలో నిరుపయోగంగా ఉన్న ఒక క్వారీలో అద్భుతమైన హోటల్‌ నిర్మించి ప్రపంచదృష్టిని ఆకర్షించారు. ‘షాంఘై వండర్‌ల్యాండ్‌’గా పిలుస్తున్న ఈ హోటల్‌ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.


మూసేసిన క్వారీలో...

క్వారీని ఆనుకుని నిర్మించిన ఈ భూగర్భ హోటల్‌లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పర్యావరణ అనుకూల భవనంగా దీనికి గుర్తింపు ఉంది. చైనాలోని సాంగ్జాంగ్‌ జిల్లాలో ఒక ఇండస్ట్రియల్‌ క్వారీ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ బొగ్గు తవ్వడం వల్ల క్వారీ ఏర్పడింది. 2000వ సంవత్సరంలో ఈ క్వారీని మూసివేశారు. అయితే అక్కడే ఒక భారీ హోటల్‌ నిర్మిస్తే కొత్తగా బాగుంటుందనే ఆలోచన చేశారు కొందరు. ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఆ క్వారీలోనే హోటల్‌ నిర్మాణం చేపట్టారు. దశాబ్దం పాటు హోటల్‌ నిర్మాణ పనులు సాగాయి. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 5వేల మంది నిపుణులు, ప్రముఖ ఆర్కిటెక్టులు పనిచేశారు.

book2.2.jpg


నిర్మాణ సమయంలో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా శ్రమించి నిర్మాణం పూర్తి చేశారు. 2013లో భారీ వర్షాల కారణంగా దగ్గరలో ఉన్న నది పొంగి క్వారీ మొత్తం నీటితో నిండిపోయింది. అందులో నిర్మాణ పనులు జరుగుతున్న కొన్ని అంతస్తులు నీటిలో మునిగిపోయాయి. ఒకవేళ నిర్మాణం పూర్తయిన తరువాత జరిగి ఉంటే భారీ నష్టం ఉండేది. ఆ అనుభవం నుంచి భవిష్యత్తులో అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు గొయ్యి చుట్టూ ఒక కట్ట నిర్మాణం చేశారు. నీటి మట్టాన్ని నియంత్రించేందుకు పంప్‌హౌజ్‌ని నిర్మించారు.


book2.3.jpg

ఈ హోటల్‌ నిర్మాణానికి బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ మార్టిన్‌ జోచ్‌మన్‌ పనిచేశారు. దీనిని భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా డిజైన్‌ చేశారు. ‘‘నేను మొదటి నుంచీ నా నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఉత్సాహంగా పనిచేశాను. ఇప్పుడు హోటల్‌ని చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది’’ అంటారు మార్టిన్‌ జోచ్‌మన్‌. దుబాయ్‌లో బుర్జ్‌ ఆల్‌ అరబ్‌ హోటల్‌ నిర్మించిన ఆట్కిన్స్‌ సంస్థ ఈ హోటల్‌ నిర్మాణం పూర్తి చేసింది.


అతిథులకు కనువిందు

సముద్రమట్టానికి 288 అడుగుల దిగువన ఈ హోటల్‌ ఉంది. ప్రపంచంలో అత్యంత దిగువన ఉన్న హోటల్‌గా గుర్తింపు పొందింది. హోటల్‌లో మొత్తం 18 అంతస్తులున్నాయి. భూమి ఉపరితలంపైన రెండు అంతస్తులు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 16 అంతస్తులు భూ ఉపరితలానికి దిగువన ఉంటాయి. వీటిలో రెండు అంతస్తులు నీళ్లలో ఉంటాయి. ఇందులో గెస్ట్‌రూమ్స్‌, రెస్టారెంట్‌, అక్వేరియం ఉన్నాయి. ఇక అతిథుల కోసం మొత్తం 337 గెస్ట్‌రూమ్స్‌ ఉన్నాయి. హోటల్‌లో బస చేసిన అతిథులు వాటర్‌ఫాల్స్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేయవచ్చు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ గార్డెన్స్‌తో హోటల్‌ ఆకట్టుకుంటుంది.


లగ్జరీ హోటల్‌లో ఉండే సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తాయి. ప్రతీ గదికి బాల్కనీ సదుపాయం ఉండేలా నిర్మించారు. బాల్కనీలో కూర్చుని క్వారీలో జాలువారే కృత్రిమ జలపాతాన్ని చూడొచ్చు. రూఫ్‌ మొత్తం గ్రీనరీతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఏరియల్‌ వ్యూలో హోటల్‌ నిర్మాణం అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో బస చేసిన వారు సరదాగా రాక్‌ క్లైంబింగ్‌ చేయవచ్చు. సాహసప్రియులు బంగీ జంపింగ్‌ కూడా చేసే వీలుంది. మొత్తానికి కొత్తదనం కోరుకునే పర్యాటకులకు ఈ హోటల్‌ స్వర్గధామం అనడంలో సందేహం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 12:53 PM