Dramatic Orca Hunt: చుట్టు ముట్టిన కిల్లర్ వేల్స్.. ప్రాణ భయంతో బోటెక్కిన సీలు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:59 AM
ప్రాణ భయంతో ఓ సీలు పడవ ఎక్కేసింది. కిల్లర్ వేల్స్ గుంపు నుంచి తప్పించుకోవడానికి ఆ సీలు ఈ పని చేసింది. వేల్స్ అక్కడినుంచి వెళ్లిపోయే వరకు ఆ సీలు బోటు మీదే ఉండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సృష్టిలో ప్రతీ జీవికి ప్రాణ భయం ఒకేలా ఉంటుంది. ప్రాణాలకు ముప్పు అని తెలిసినపుడు చీమల దగ్గరినుంచి ప్రపంచంలోనే అత్యంత పెద్ద జీవి అయిన బ్లూ వేల్ వరకు ఒకేలా స్పందిస్తాయి. ఇందుకు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ సీలు నీటిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది. ఇలాంటి సమయంలో కిల్లర్ వేల్స్ గుంపు అటువైపు వచ్చింది. వాటిని చూడగానే సీలు గుండెలు ఝల్లుమన్నాయి. వెంటనే పక్కనే ఉన్న పడవ ఎక్కి కూర్చుంది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చార్వెట్ డ్రక్కర్ అనే ఫొటో గ్రాఫర్ సీయాటెల్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న సాలిష్ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తూ ఉంది. అక్కడి నీటి జీవుల్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ సీలు ఠక్కున ఆమె ప్రయాణిస్తున్న పడవ వెనుక భాగంలోకి ఎక్కి కూర్చుంది. ఆ సీలు ఎందుకలా పడవ ఎక్కి కూర్చుందో ఆమెకు మొదట అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం తెలిసింది.
కిల్లర్ వేల్స్ గుంపు సీలు ఉన్న ప్రాంతంలో తిరుగుతూ ఉంది. అవి ఆహారం కోసం ఎంతో ఒపిగ్గా ఎదురు చూస్తూ ఉన్నాయి. సీలు మాత్రం కిందకు దిగలేదు. దీంతో సీలును పడవ నుంచి కిందకు జారి పడేలా చేయడానికి వేవ్ వాషింగ్ టెక్నిక్‌ను అమలు చేశాయి. గట్టిగా తమ తోకలతో నీటిని కొట్టసాగాయి. పాపం ఆ సీలు భయంతో బిక్కుబిక్కుమంటూ చార్వెట్ వైపు చూడసాగింది. 15 నిమిషాల తర్వాత అవి అక్కడినుంచి వెళ్లిపోయాయి. చార్వెట్ పడను ఒడ్డుకు తీసుకువచ్చింది. పడవ ఒడ్డుకు రాగానే సీలు నీటిలోకి దూకేసింది.
ఇవి కూడా చదవండి
కేంద్ర మాజీ మంత్రి ఆర్‌కే సింగ్‌పై బీజేపీ వేటు
లాలూ కుటుంబంలో బిహార్ ఫలితాల చిచ్చు