BJP Action: కేంద్ర మాజీ మంత్రి ఆర్‌కే సింగ్‌పై బీజేపీ వేటు
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:54 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది.
పట్నా, నవంబరు 15: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్డీయే ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి రాజ్‌కుమార్(ఆర్‌కే) సింగ్‌ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆర్‌కే సింగ్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్‌కుమార్ అగర్వాల్, ఆయన భార్య కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను కూడా బీజేపీ సస్పెండ్ చేసింది. వీరు తమ కుమారుడు సౌరభ్ అగర్వాల్‌ను వికా్‌సశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) తరఫున కతిహార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్ సింగ్‌పై పోటీకి నిలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌కే సింగ్ 2014లో బీజేపీలో చేరి ఆరా లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఎన్నికయ్యారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిపై ఇటీవల వచ్చిన నేరారోపణలతో పాటు భగల్పుర్‌లో అదానీ గ్రూపుతో ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ ప్లాంట్ ఒప్పందంపై కూడా ఆర్‌కే సింగ్ బహిరంగ విమర్శలు చేసి పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం కలిగించారు.