Saif Ali khan: గాయాలతో ఉన్న సైఫ్ అలీఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన కొడుకు.. ఎందుకంటే...
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:05 PM
కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. డాక్టర్లు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేయడంతో సైఫ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. గురువారం తెల్లవారుఝామున 2:30 గంటల సమయంలో సైఫ్ నివాసంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను ఓ దుండగుడు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసిన సంగతి తెలిసిందే. కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. డాక్టర్లు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేయడంతో సైఫ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. గురువారం తెల్లవారుఝామున 2:30 గంటల సమయంలో సైఫ్ నివాసంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది (Attack on saif Ali Khan).
సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలో దుండగుడు దాక్కున్నాడు. అతడిని చూసిన కేర్ టేకర్ గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ అక్కడకు వచ్చారు. దుండగుడిని చూసిన సైఫ్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ దుండగుడు కత్తితో ఆరు సార్లు సైఫ్‌ను పొడిచి పారిపోయాడు. దాంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అక్కడకు చేరకున్న సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే అప్పటికి ఇంట్లో కారు, డ్రైవర్ సిద్ధంగా లేకపోవడంతో ఆటోలో సైఫ్‌ను లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లి చేర్పించారు. తన ఇంటి ఆవరణలో టెన్షన్‌గా ఉన్న కరీనా కపూర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సైఫ్‌పై అలీఖాన్‌పై దాడి గురించి తెలుసుకున్న బాలీవుడ్ ఉలిక్కిపడింది. సినీ ప్రముఖులందరూ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు. సైఫ్ ఇంటికి చేరుకుని పని వారిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లీలావతి హాస్పిటల్‌కు చేరుకుని సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించారు. ఇతర హీరోలు, నటులు సోషల్ మీడియా ద్వారా తమ విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..