Share News

ఈ రాకెట్లు... వానల కోసం...

ABN , Publish Date - May 18 , 2025 | 12:32 PM

వానలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం... యాగాలు చేయడం లాంటివి చూస్తుంటాం. అలాంటి ఒక పురాతన నమ్మకమే ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌లో ఉంది. వాళ్లు ఏం చేస్తారో తెలుసా? ఆకాశంలోకి రాకెట్లు పేల్చుతారు. మూడు రోజులపాటు ఒక పండగలా సాగే ఆ విశేషాలివి...

ఈ రాకెట్లు... వానల కోసం...

ప్రతీ ఏడాది మే, జూన్‌ వచ్చిందంటే... లావోస్‌, థాయ్‌లాండ్‌లలో రాకెట్లు తయారు చేసి, ఆకాశంలోకి వదులుతారు. చక్కటి వానలు కురిసి, పంటలు సుభిక్షంగా పండాలని కోరుకుంటూ ఆయా దేశాలలో వానాకాలానికి ముందు రాకెట్లు పేల్చడం అనాదిగా వస్తోన్న ఆనవాయితీ. ఇదే ‘బూ బాంగ్‌ ఫీ’ లేదా రాకెట్ల పండగ.

మూడు రోజుల ఉత్సవం...

చాంద్రమానం ప్రకారం ఆరో నెలలో ఈ రాకెట్ల పండగను జరుపుకొంటారు. అక్కడ ఈ పండగకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. రాకెట్లతో ఆకాశ దేవుడు, వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవాలన్నది ప్రధాన ఇతివృత్తం. సాధారణంగా ప్రతీ ఏడాది మే, జూన్‌ మాసాల మధ్యలో వచ్చే మూడు రోజుల పండగ ఇది. తొలిరోజు సాంప్రదాయ నృత్యగీతాలతో సాగుతుంది. రెండో రోజు శకటాల ఊరేగింపులు, ఇక మూడో రోజు రాకెట్లను పేల్చడం చేస్తారు. ప్రతీ గ్రామంలోని స్థానికులు తమకు తోచిన విధంగా రాకెట్లను అందంగా తయారుచేసి పోటీలో పాల్గొంటారు.


book1.2.jpg

కొన్ని రాకెట్లు వంద కిలోల బరువు కూడా ఉంటాయి. వాటన్నింటిలో ఆకాశంలోకి ఎక్కువ దూరం వెళ్లిన రాకెట్‌ను తయారు చేసిన గ్రామానికి బహుమతులు అందచేస్తారు. ఒకప్పుడు రాజధాని వియంతియేన్‌లో మెకాంగ్‌ నదీ తీరంలో పెద్దఎత్తున రాకెట్ల పండగను జరుపుకొనేవారు. అయితే పట్టణీకరణ కారణంగా ఆ నగరంలో రద్దీ పెరిగింది. అందుకే శివారు ప్రాంతాలైన నసన్‌, నథమ్‌, తోంగ్‌మాంగ్‌, కెర్న్‌, పఖాన్‌హాంగ్‌కు వేదికలను మార్చారు.


‘బూ బాంగ్‌ ఫీ’లో ఉపయోగించే రాకెట్లన్నీ దాదాపుగా వెదురుతో తయారు చేసినవే ఉంటాయి. ఇందులో లోహాల గొట్టాలలో మందుగుండును దట్టిస్తారు. ముందుగా అన్ని గ్రామాల్లోనూ తయారు చేసిన రాకెట్లను వరుసగా ఊరేగిస్తారు. నిర్వాహకులు వాటిని పూర్తిగా పరిశీలించి, ఓకే చేస్తారు. భారీతనం, అందం, విభిన్నత మొదలైన విభాగాల్లో బహుమతులు ఉంటాయి.


book1.3.jpg

ఈ మూడు రోజులూ లావోస్‌లో సందడి, కోలాహలం వర్ణణాతీతం. తినుబండారాలు సరేసరి. ఈ పండగకు కుటుంబం అంతా కలుస్తారు. లావోస్‌తో పాటు థాయిలాండ్‌లో కొన్ని ప్రాంతాలలో రాకెట్ల పండగను ఘనంగా జరుపకొంటున్నారు. ఆగ్నేయాసియా దేశాల పండగలు చాలావరకు బౌద్ధంతో ముడిపడి ఉంటాయి. బుద్ధ పూర్ణిమ సమయంలోనే రాకెట్ల పండగ చేసుకోవడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 12:32 PM