Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:49 PM
నేషనల్ హైవేపై పట్టపగలు ఓ భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా దోచేశారు. ఏకంగా 85 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించేలా నేషనల్ హైవేపై ఓ భారీ చోరీ జరిగింది. బైకు, కారుపై వచ్చిన దొంగలు ఎంతో చాకచక్యంగా 85 లక్షల రూపాయలు దోచేశారు. అది కూడా పెద్దగా కష్టపడకుండానే ఈజీగా డబ్బులు దొంగతనం చేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వ్యాపారవేత్త దగ్గర అకౌంటెంట్‌గా పని చేస్తూ ఉన్నాడు. డిసెంబర్ 15వ తేదీన తన యజమానికి సంబంధించిన 85 లక్షల రూపాయలు బ్యాగులో పెట్టుకుని ఢిల్లీ - లక్నో హైవేపై వెళుతూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్న ఓ బైకు.. అకౌంటెంట్ బైకుకు అతి దగ్గరగా వచ్చింది. ఆ వెంటనే ఓ కారు కూడా అక్కడికి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కారు సపోర్టు తీసుకుని.. అకౌంటెంట్ బైకును కాలితో తన్నారు. దీంతో అకౌంటెంట్ బైకుతో సహా హైవేపై పడిపోయాడు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు 85 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడ్డ అకౌంటెంట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల ఫొటోలను రిలీజ్ చేశారు. ఒక్కొక్కరి తలపై 50 వేల రూపాయలు రివార్డు కూడా ప్రకటించారు. వారి గురించిన సమాచారం చెప్పిన వారికి ఈ మొత్తం ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఎస్పీ కునార్ స్పష్టం చేశారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ దుండుగులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రప్పా రప్పా అంటే వదలి పెట్టను.. జగన్ అండ్ కోకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..