Rajasthan Education Minister Niece: మేన కోడలికి షాక్ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి.. రూల్స్ అందరికీ ఒకటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:50 PM
సీమా చేతులు ఎత్తి వారిని ప్రార్థించింది. లోపలికి పంపించమని వేడుకుంది. రూల్స్ ప్రకారం లోపలికి పంపకూడదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆమె తన మేనమామ అయిన విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవకతవకలకు పాల్పడే మంత్రుల గురించి వినే ఉంటారు. కానీ, ఈ స్టోరీలో మంత్రి చాలా గొప్పోడు. రూల్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయి అని చెప్పడానికి రక్త సంబంధాన్ని సైతం లెక్కచేయలేదు. మేన కోడలికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇంతకీ సంగతేంటంటే.. ఆదివారం రాజస్థాన్, బరన్ జిల్లాలో ఆర్పీఎస్సీ సీనియర్ టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ ఎగ్జామ్ జరిగింది. సీమా పరిహార్ అనే యువతి ఎగ్జామ్ రాయడానికి అట్రులోని కమలా కాన్వెంట్ స్కూల్ దగ్గరకు వెళ్లింది. అయితే, అప్పటికే రిపోర్టింగ్ సమయం మించిపోయింది.
ఆర్పీఎస్సీ రూల్స్ ప్రకారం రిపోర్టింగ్ సమయం దాటిపోవటంతో అధికారులు ఆమెను ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్లనివ్వలేదు. సీమా చేతులు ఎత్తి వారిని ప్రార్థించింది. లోపలికి పంపించమని వేడుకుంది. రూల్స్ ప్రకారం లోపలికి పంపకూడదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆమె తన మేనమామ అయిన విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. తనకు సహాయం చేయమని అడిగింది. అయితే, మంత్రి మాత్రం ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘రూల్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయి.
పరీక్షకు హాజరయ్యే ప్రతీ ఒక్క వ్యక్తి నాకు ఒకటే. ఆలస్యంగా వచ్చిన వారికి ఎంట్రీ ఉండదు’ అని తేల్చి చెప్పాడు. సీమా ఫోన్ పెట్టేసింది. ఈ సారి సీమాతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అధికారులను బ్రతిమాలారు. అయినా కూడా వాళ్లు వినలేదు. ఇక, చేసేది ఏమీ లేక సీమా అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న కొంతమంది నెటిజన్లు విద్యాశాఖ మంత్రిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం మేనకోడలికి సాయం చేయనందుకు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఏసీ పేలుడు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..