Share News

Hippo Capsizes Boat: పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..

ABN , Publish Date - Sep 08 , 2025 | 08:13 PM

ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో వరుస పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. రెండు రోజుల క్రితం నైజీరియాలోనూ ఓ పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

Hippo Capsizes Boat: పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..
Hippo Capsizes Boat

హిప్పో కోపం తీవ్ర విషాదానికి దారి తీసింది. హిప్పో పడవను ఎత్తి పడేసిన ఘటనలో 11 మంది నీటిలో కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా నీటిలో గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన పశ్చిమ ఆఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఓ పడవ 14 మంది ప్రయాణికులతో ఐవరీ కోస్ట్‌లోని ససేండ్రా నదిలో వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఓ హిప్పో ఆ పడవపై దాడి చేసింది. ఆగ్రహంతో పడవను ఎత్తి పడేసింది.


దీంతో పడవలోని వారందరూ నదిలో పడి కొట్టుకుపోయారు. 14 మందిలో మహిళలు, బాలికలు, పసి పిల్లలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ముగ్గురిని మాత్రం క్షేమంగా ఒడ్డకు చేర్చింది. అయితే, మూడు రోజులు గడిచినా మిగిలిన 11 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. నీటిలో గల్లంతైన వారి కుటుంబసభ్యులు తమ వారు క్షేమంగా తిరిగిరావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.


మరో ఘటనలో 40 మంది..

ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో వరుస పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. రెండు రోజుల క్రితం నైజీరియాలోనూ ఓ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడటంతో 40 మంది దాకా గల్లంతయ్యారు. సొకోటో రాష్ట్రంలోని గొరన్యో ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను మార్కెట్‌కు తరలిస్తుండగా పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. అందులోని వారందరూ నదిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. 10 మందిని రక్షించింది. మిగిలిన వారి కోసం గాలిస్తోంది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా..?

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

Updated Date - Sep 08 , 2025 | 08:30 PM