Bear Attack On Singer: ప్రముఖ సింగర్‌పై దాడి చేసిన ఎలుగుబంటి
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:50 AM
సింగర్ తన టెంట్‌లో నిద్రపోతూ ఉండగా దారుణం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది. చేతుల్ని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రముఖ పాకిస్తాన్ సింగర్, గేయ రచయిత ఖుర్రతులైన్ బలోచ్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. ఆమె రెండు చేతుల్ని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..పాకిస్తాన్‌లోని బలిస్తాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సింగర్ ఖుర్రతులైన్ బలోచ్ పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాంప్రహెన్సివ్ డిజాస్టర్ రెస్పాన్స్ సర్వీస్‌తో కలిసి పని చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం స్కర్ధు, డియోసయ్ నేషనల్ పార్క్‌లోని బారా పాని కొండ ప్రాంతంలో సీడీఆర్ఎస్ బృందంతో కలిసి నైట్ క్యాంప్ వేశారు.
ఆమె తన టెంట్‌లో నిద్రపోతూ ఉండగా దారుణం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది. చేతుల్ని తీవ్రంగా గాయపరిచింది. ఖుర్రతులైన్ బలోచ్ గట్టిగా అరవటంతో పక్క టెంట్లలోని వారు నిద్రలేచారు. ఎలుగుబంటిని భయపెట్టి అక్కడినుంచి తరిమేశారు. గాయడపడ్డ సింగర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఖుర్రతులైన్ బలోచ్ టీమ్ ఎలుగుబంటి దాడిపై స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ‘సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది.
ఆమె తన టెంట్‌లో నిద్రపోతూ ఉంది. అప్పుడు ఓ ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది. సీడీఆర్ఎస్ టీమ్ ఎలుగుబంటిని భయపెట్టి తరిమేసింది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. అదృష్టం కొద్ది ఆమె చేతులు విరిగిపోలేదు. గాయాలు మాత్రమే అయ్యాయి. వాటినుంచి ఆమె కోలుకుంటోంది. ఖుర్రతులైన్ బలోచ్‌కు విశ్రాంతి, ఏకాంతం కావాలి. తను కోలుకునే వరకు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనదు. ఆమె అత్యంత త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాము’ అని సింగర్ టీమ్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా