Harish Rao: కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:10 AM
ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
నా జీవితం తెరిచిన పుస్తకం: హరీశ్‌రావు
కేసీఆర్‌తో హరీశ్‌రావు కీలక భేటీ
లండన్ నుంచి రాగానే ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు
భేటీలో పాల్గొన్న కేటీఆర్.. సుదీర్ఘ మంతనాలు
కవిత వ్యాఖ్యలు, కాళేశ్వరం అంశంపై చర్చ
వారం రోజులుగా కేసీఆర్‌తోనే కేటీఆర్
హైదరాబాద్, శంషాబాద్ రూరల్/గజ్వేల్/మర్కుక్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరచిన పుస్తకం వంటిదని, రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కవిత తనపై ఆరోపణలు చేసిన సమయంలో లండన్ పర్యటనలో ఉన్న హరీశ్‌రావు.. శనివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కవిత చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ‘‘గత కొంతకాలంగా మా పార్టీపై, నాపై కొందరు నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు (కవిత) కూడా చేశారు. ఆ వ్యాఖ్యలను వారు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు గోస పడుతున్నారని, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ దశాబ్ద కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు.
కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ
మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయనతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లండన్ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన హరీశ్‌రావు.. వెంటనే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సకు వెళ్లారు. అక్కడే ఉన్న కేటీఆర్‌తో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లగా.. వీరితో ఫాంహౌస్ పై అంతస్తులో అధినేత సమావేశమైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా కాళేశ్వరం అంశంలో వ్యవహరించాల్సిన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎలా ఇరకాటంలో పెట్టాలన్న దానిపైనా సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. వీరి మధ్య చర్చ జరుగుతున్న సమయంలో ఎవరినీ లోపలికి రానివ్వలేదని, సాయంత్రం వరకు హరీశ్‌రావు ఫాంహౌ్‌సలోనే ఉన్నారని సమాచారం. కాగా, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఫొటోలు దిగి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకున్నారు. కవిత సస్పెన్షన్ అనంతరం పార్టీకి వీరిద్దరే కీలకమన్నదే సదరు పోస్టుల సారాంశమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌ్‌సలోనే మకాం వేశారు. ఇక్కడే ఉంటూ పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. శనివారం ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఫాంహౌస్‌కు వచ్చారు.