Passenger Vehicles Discounts: మహీంద్రా తగ్గింపు తక్షణమే
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:16 AM
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని కొత్త కార్ల కొనుగోలుదారులకు అందించేందుకు మరిన్ని కంపెనీలు ముందుకువచ్చాయి. ఇప్పటికే పలు మోడళ్ల ధరలను...
కార్ల ధరల తగ్గింపును ప్రకటించిన టొయోటా, రెనో, మహీంద్రా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని కొత్త కార్ల కొనుగోలుదారులకు అందించేందుకు మరిన్ని కంపెనీలు ముందుకువచ్చాయి. ఇప్పటికే పలు మోడళ్ల ధరలను తగ్గించనున్నట్టు టాటా మోటార్స్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బాటలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), రెనో ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు శనివారం ప్రకటించాయి. టొయోటా, రెనో ఈ నెల 22 నుంచి తగ్గించిన ధరలను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించగా.. మహీంద్రా మాత్రం తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడించింది.
టొయోటా రూ.3.49 లక్షల వరకు..
తన వాహనాల ధరలను రూ.3.49 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ ధర రూ.85,300 వరకు, టైసర్ ధర రూ.1.11 లక్షలు, రుమియన్ ధర రూ.48,700, హైరైడర్ రూ.65,400, క్రిస్టా రూ.1.8 లక్షలు, హైక్రాస్ రూ.1.15 లక్షలు, ఫార్చూనర్ ధర రూ.3.49 లక్షలు తగ్గనున్నట్టు పేర్కొంది. అలాగే లెజెండర్ ధర రూ.3.34 లక్షలు తగ్గే అవకాశం ఉండగా.. హైలక్స్ ధర రూ.2.52 లక్షలు, కామ్రీ ధర రూ.1.01 లక్షలు, వెల్‌ఫైర్ ధర రూ.2.78 లక్షలు తగ్గనున్నట్టు తెలిపింది. ఈ నెల 22 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీకేఎం వైస్ ప్రెసిడెంట్ (సేల్స్-సర్వీ్‌స-యూజ్డ్ కార్ బిజినెన్ అండ్ ప్రాఫిట్ ఎన్‌హాన్స్‌మెంట్) వరిందర్ వాద్వా పేర్కొన్నారు.
రెనో రూ.96,395 వరకు..
జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు పూర్తిగా అందించనున్నట్టు రెనో ప్రకటించింది. తమ వాహనాల ధరలను రూ.96,395 వరకు తగ్గించనున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షి్‌పలలో కొత్త ధరలతో కస్టమర్లు రెనో కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంట్రీలెవల్ క్విడ్ ధర రూ.55,095 వరకు, ట్రైబర్ ధర రూ.80,195, కైగర్ ధర రూ.96,395 వరకు తగ్గనున్నట్టు కంపెనీ తెలిపింది. సవరించిన ధరలు ఈనెల 22న, ఆ తర్వాత చేసే అన్ని డెలివరీలకు వర్తిస్తుందని పేర్కొంది.
భారీగా ధరలు తగ్గించే యోచనలో మారుతీ
దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతీ సుజుకీ కూడా తన కార్ల ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందన్న సంకేతాలిచ్చింది. ఆల్టో ధర రూ.40,000-50,000, వ్యాగన్ ఆర్ ధర రూ.60,000-67,000 మధ్య తగ్గవచ్చని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ‘బిజినెస్ స్టాండర్డ్’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ధరలకు సంబంధించిన వివరాలపై కంపెనీ అధికారులు ఇంకా కసరత్తు చేస్తున్నారని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు నేరుగా చిన్న కార్లకు ప్రయోజనం కలిగిస్తాయని, ఈ ఏడాదిలో అమ్మకాల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పన్ను సంస్కరణలతో ఆటో రంగానికి కీలకమైన ఊతం లభిస్తుందన్నారు. కాగా పన్ను తగ్గింపు తర్వాత (ఎక్స్‌షోరూమ్) మారుతీ కార్ల బేస్ మోడళ్ల ధరల అంచనాల విషయానికి వస్తే.. ఆల్టో కే10 రూ.40వేలు, వ్యాగన్ ఆర్ రూ.57 వేలు, స్విఫ్ట్ రూ.58వేలు, డిజైర్ రూ.61 వేలు, బాలెనో రూ.60వేలు, ఫ్రాన్‌ఎక్స్ రూ.68వేలు, బ్రెజ్జా రూ.78వేలు, ఎర్టిగా రూ.41వేలు, సెలేరియో రూ.50వేలు, ఎక్స్‌ఎల్ 6 రూ.35 వేలు, జిమ్నీ రూ.1.14 లక్షలు, ఇగ్నిస్ రూ.52వేలు, ఇన్విక్టో రూ.2.25 లక్షలు, ఎస్-ప్రెసో రూ.38 వేలు తగ్గవచ్చని అంచనా.
రూ.2 లక్షల దిగువకు జావా, యెజ్డీ బైక్‌లు
350 సీసీకన్నా తక్కువ ఉన్న మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28ు నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్ల ధరలను తగ్గిస్తున్నట్టు క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ ప్రకటించింది. దీంతో కొత్త కస్టమర్లకు రూ.17 వేల వరకు ప్రయోజనం కలుగనుంది. ధరల తగ్గింపుతో పలు మోడళ్ల ధరలు రూ.2 లక్షల ధరకన్నా(ఎక్స్‌షోరూమ్) దిగువకు రానున్నాయి. యెజ్డీ అడ్వెంచర్, రోడ్‌స్టర్, స్ర్కాంబ్లర్, జావా 42 బాబర్ వంటి మోడళ్ల ధరలు దిగిరానున్నాయి. జావా 42 ధర రూ.1,72,942 నుంచి రూ.1,59,431కు (రూ.13,511 ఆదా), జావా 350 ధర రూ.1,98,950 నుంచి రూ.1,83,407కు (రూ.15,543 ఆదా), 42 బాబర్ ధర రూ.2,09,500 నుంచి రూ.1,93,133కు (రూ.16,367 ఆదా), 42 ధర రూ.2,10,142 నుంచి రూ.1,93,725కు (రూ.16,417 ఆదా), పెరాక్ ధర రూ.2,16,705 నుంచి రూ.1,99,775కు (రూ.16,930 ఆదా) తగ్గనుంది. ఇక యెజ్డీ రోడ్‌స్టర్ ధర రూ.2,09,969 నుంచి రూ.1,93,565కు (రూ.16,404 ఆదా), అడ్వెంచర్ ధర రూ.2,14,900 నుంచి రూ.1,98,111కు (రూ.16,789 ఆదా), స్ర్కాంబ్లర్ ధర రూ.2,11,900 నుంచి రూ.1,95,345కు (రూ.16,555 ఆదా) దిగిరానున్నాయి.
మహీంద్రా రూ.1.56 లక్షల వరకు
తన ప్యాసెంజర్ వాహన శ్రేణి ధరలను రూ.1.56 లక్షల వరకు తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బొలేరో/నియో రేంజ్ ధర రూ.1.27 లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్‌వో (పెట్రోల్) రూ.1.4 లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్‌వో (డీజిల్) రూ.1.56 లక్షలు, థార్2డబ్ల్యూడీ (డీజిల్) రూ.1.35 లక్షలు, థార్4డబ్ల్యూడీ (డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షలు, థార్‌రాక్స్ రూ.1.33 లక్షలు, ఎక్స్‌యూవీ700 రూ.1.43 లక్షల మేర తగ్గించింది.
ఇవి కూడా చదవండి..
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
For More National News And Telugu News