Jodhpur Royals: జోధ్‌పూర్ రాజకుమారి.. వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా..
ABN , Publish Date - Jun 06 , 2025 | 06:15 PM
వేల కోట్ల ఆస్తులకు వారసురాలైన జోధ్‌పూర్ రాజకుమారి శివరంజని అత్యంత నిరాడంబర జీవితం గడుపుతుంటారు. రాజకుటుంబ వారసత్వాన్ని కాపాడుకునేందుకు అహరహం శ్రమిస్తుంటారు.
భారత్‌లో రాచరిక పాలన ఎప్పుడో అంతమైపోయినప్పటికీ కూడా రాజ కుటుంబాలు అనేకం ఇప్పటికీ సిరి సంపదలతో విలసిల్లుతున్నాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో రాజ కుటుంబీకులు లగ్జరీ లైఫ్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం ఎన్ని ఆస్తిపాస్తులున్నా నిరాడంబరంగా జీవిస్తుంటారు. జోధ్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన రాకుమారి శివరంజనీ రాజ్యే కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా జీవించేందుకు ఆసక్తి చూపే ఆమె తన వ్యాపార దక్షతతో రాజకుటుంబానికి ఆర్థిక స్థిరత్వం తీసుకొచ్చారు.
భారత్‌లోని ప్రముఖ జోధ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన శివరంజని తన సోదరుడితో కలిసి కుటుంబ ఆస్తిపాస్తులు కాపాడటంలో ఆర్థిక స్థిరత్వం చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. రాజ కుటుంబం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. ఇక జోధ్‌పూర్ రాజవంశీకులకు ఉన్న ఆస్తుల్లో ఉమైద్ భవన్ ప్యాలెస్ ముఖ్యమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనంగా పేరు పొందింది. శివరంజనితో పాటు ఇతర కుటుంబసభ్యులు ఇప్పటికీ ఇదే ప్యాలెస్‌లో ఉంటారు. 26 ఎకరాల్లో ఉన్న ఈ ప్యాలెస్‌లో 347 గదులు ఉన్నాయి.
1929లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 15 ఏళ్ల పాటు నిర్మాణ పనులు సాగాయి. అయితే, తమ డాబూదర్పం ప్రదర్శించేందుకు రాజకుటుంబం ఈ ప్యాలెస్‌ను నిర్మించలేదు. కరువుకాటకాలతో అల్లాడుతున్న ప్రజలకు ఆదాయ మార్గం సమకూర్చేందుకు ఈ ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. సుమారు 4 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్నారు. మొత్తం రూ. 1,09,11,228 ఖర్చయ్యాయి.
ఈ ప్యాలెస్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఒక భాగంలో రాజకుటుంబం ఇప్పటికీ నివసిస్తూ ఉంటుంది. మరో భాగాన్ని ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియంగా మార్చారు. మూడో భాగాన్ని ఉమైద్ భవన్ ప్యాలెస్ హోటల్‌గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మహారాజ్ గజ్ సింగ్, ఆయన కుటుంబం ఈ ప్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. రాజకుటుంబానికి వారసులైన యువరాజు శివరాజ్ సింగ్, ఆయన సోదరి శివరంజనీ రాజ్యే ప్యాలెస్ నిర్వహణను చూసుకుంటారు. మహారాజు పెద్ద కుమార్తె శివరంజని. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఆమె సోదరుడు భారీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో శివరంజని రంగంలోకి దిగి కుటుంబానికి అండగా నిలిచారు. సమస్యల నుంచి గట్టెక్కించారు. నాటి నుంచి ఆమె తన సోదరుడితో కలిసి కుటుంబ వారసత్వాన్ని కాపాడేందుకు, ఆర్థిక స్థిరత్వం చేకూర్చేందుకు అహరహం పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..