Woman Forced To Deliver On Floor: మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన.. కటిక నేలపై గర్భిణికి ప్రసవం
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:04 PM
చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉండిపోయారే తప్ప ఆమెకు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రాత్రి 1:30 గంటల సమయంలో అందరూ చూస్తుండగా.. కటిక నేలపై ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.
ఉత్తరాఖండ్‌లో అత్యంత అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు, సిబ్బంది మానవత్వాన్ని మంట గలిపే పనికి పూనుకున్నారు. కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళను పట్టించుకోకపోవటంతో ఆమె కటిన నేలపైనే ప్రసవించాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి హరిద్వార్‌కు చెందిన ఓ గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. ఆస్పత్రిలో కాన్పులు చేయరని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అత్యంత పేదరికంలో బతుకుతున్న గర్భిణి కుటుంబం ఆమెను ఆ ఆస్పత్రి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయింది. మహిళ నొప్పులతో విలవిల్లాడింది. అయినా డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ ఆమెను పట్టించుకోలేదు. వారికి ఏ సంబంధం లేదన్నట్లు ఉండిపోయారు.
చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉండిపోయారే తప్ప ఆమెకు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రాత్రి 1:30 గంటల సమయంలో అందరూ చూస్తుండగా.. కటిక నేలపై ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్యూటీ డాక్టర్ సోనాలిని ఉద్యోగం లోంచి తీసేశారు. ఇద్దరు నర్సులకు కూడా నోటీసులు పంపారు.
ఇవి కూడా చదవండి
నిలకడగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం
సిరాజ్ జోరు.. మొదటి టెస్ట్‌లో విండీస్ తడబాటు..