Snacks Palmolein Controversy: కుర్కురేలో పామోలిన్ అంటూ వినియోగదారుడి ఆరోపణ.. పెప్సీకో ఏమందంటే..
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:18 PM
కుర్కురేలో పామోలిన్ ఉందంటూ ఓ కస్టమర్ నెట్టింట పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. దీనిపై పెప్సీకో కూడా స్పందించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో విక్రయిస్తున్న కుర్కురే ప్యాకెట్‌లల్లో తేడా ఉందంటూ ఓ కస్టమర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీనిపై స్పందించిన పెప్సీకో సంస్థ సదరు కస్టమర్‌కు వివరణ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Palmolein).
వేదాంత్ ఖండూజా అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టారు. బెంగళూరులో, ఢిల్లీల్లో విక్రయించే కుర్కురే తయారీలో వినియోగించిన ముడి సరుకుల్లో తేడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ వాసులను హెచ్చరించారు. ఢిల్లీలోని కుర్కురే స్నాక్స్‌ను పామోలిన్‌తో చేస్తుండొచ్చని హెచ్చరించారు. ‘బెంగళూరులోని ఓ కుర్కురే ప్యాకెట్‌పై లేబుల్ చదివా. దాని మీద పామోలిన్ అని రాసి లేదు. ఢిల్లీలోని ప్యాకెట్‌పై మాత్రం పామోలిన్ అని రాసుంది’ అని చెప్పారు. బెంగళూరు లాగా ఢిల్లీకీ మెరుగైన కుర్కురే ఎందుకు లభించదు అని ప్రశ్నించాడు (PepsiCo).
ఈ సందర్భంగా ఢిల్లీ వాసులను కూడా హెచ్చరించారు. జాగ్రత్తగా ప్యాకెట్‌పై లేబుల్ చదివాకే ముందడుగు వేయండని అన్నారు. ప్యాకెట్‌పై లేబుల్స్‌ను చదివే అలవాటును ప్రోత్సహిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. లేబుల్స్ చదవడం అత్యంత కీలకమని హెచ్చరించారు. కేవలం ప్యాకెట్ ముందున్న రంగురంగుల డిజైన్ చూసి బోల్తా పడొద్దని అన్నారు.
ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో పెప్సీకో స్వయంగా వేదంత్‌కు వివరణ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు తరువాత కుర్కురే ప్యాకెట్‌ల బ్యాచులన్నిటిలో పామోలిన్‌ను తొలగించినట్టు సమాచారం. పాత బ్యాచ్‌ల ప్యాకెట్స్ అతడి కంట పడి ఉండొచ్చని చెప్పింది.
ఇక ఈ ఘటన నెట్టింట కూడా కలకలం రేపుతోంది. మార్కెట్‌లో విక్రయించే వస్తువుల విషయంలో సంస్థలు పారదర్శకత, నాణ్యత కచ్చితంగా పాటించాలని కొందరు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కలుషిత గాలినే తట్టుకుని నిలబడుతున్న జనాల్ని ఇలాంటివి ఏమీ చేయవని మరికొందరు సెటైర్లు పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
బిలియనీర్‌ల సక్సెస్‌కు కారణం ఇదీ.. సీక్రెట్ చెప్పిన న్యూరాలజిస్టు
డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్