Licensed Gun Accidentally Fires: ఊహించని విషాదం.. కాపాడుతుందనుకుంటే ప్రాణం తీసింది
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:51 PM
ఓ ఎన్ఆర్ఐ అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. రక్షణగా ఉంటుందని తీసుకున్న పిస్టల్ అతడి ప్రాణాలు తీసింది. సోఫాలోంచి పైకి లేచిన వెంటనే నడుము దగ్గర ఉన్న పిస్టల్ పేలింది.
మరణం ఎప్పుడు? ఎలా? మనల్ని చేరుకుంటుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని సార్లు ప్రాణాల్ని కాపాల్సిన వస్తువులే ప్రాణాలు తీసే విచిత్రమైన, విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా, ఓ ఎన్ఆర్ఐ అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. రక్షణగా ఉంటుందని తీసుకున్న పిస్టల్ అతడి ప్రాణాలు తీసింది. సోఫాలోంచి పైకి లేచిన వెంటనే నడుము దగ్గర ఉన్న పిస్టల్ పేలింది. బుల్లెట్ పొట్టలోకి దూసుకెళ్లటంతో ఎన్ఆర్ఐ చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్, ఫిరోజ్‌పూర్‌కు చెందిన హర్పిందర్ సింగ్ అలియాస్ సోను విదేశాల్లో పని చేసేవాడు. రెండు సంవత్సరాల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుని ధని సుచ సింగ్ గ్రామంలో సెటిల్ అయ్యాడు. హర్పిందర్ సోమవారం రోజున తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అలవాటు ప్రకారం తనతో పాటు రక్షణ కోసం పిస్టల్‌ను కూడా వెంట తీసుకెళ్లాడు. దాన్ని నడుము దగ్గర పెట్టుకున్నాడు. బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత సోఫాలో కూర్చుని వారితో మాట్లాడాడు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడినుంచి వెళ్లడానికి పైకి లేచాడు.
లేచీ లేవగానే టప్ మని పెద్ద శబ్ధం వచ్చింది. అక్కడ ఉన్న వారికి ఆ శబ్ధం ఏంటని అర్థం కాలేదు. హర్పిందర్‌కు విషయం అర్థమై పొట్ట దగ్గర చూసుకున్నాడు. బుల్లెట్ అతడి పొట్టలోకి దిగి రక్తం కారుతూ ఉంది. బంధువులు వెంటనే అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు అతడ్ని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. బతిండలోని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హర్పిందర్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి రెండు సంవత్సరాల పాప ఉంది. మంగళవారం సాయంత్రం అతడి అంత్యక్రియలు జరిగాయి.
ఇవి కూడా చదవండి
హర్మన్ ఒంటరి పోరాటం.. శ్రీలంక టార్గెట్ 176
అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు రాజ్‌నాథ్ సింగ్