Mother Daughter Tigress Clash: జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:55 AM
రిద్ధి తన భూభాగంలో సేద తీరుతూ ఉంది. ఇంతలో కూతురు మీరా అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే భూభాగం కోసం తల్లితో గొడవ పెట్టుకుంది. రెండూ భీకరంగా గొడవపడ్డాయి.
ఆస్తుల కోసం రక్త సంబంధం ఉన్నవారు గొడవపడ్డం కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంది. అయితే, జంతువుల్లో ఇలాంటి గొడవలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. భూభాగం కోసం కొన్ని జంతువులు రక్త సంబంధీకులతో గొడవపడుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఆడపులి.. తల్లి పులి నివసిస్తున్న భూభాగాన్ని ఆక్రమించడానికి చూసింది. తల్లిమీదే యుద్ధానికి దిగింది. ఆ తల్లి సరైన విధంగా బుద్ధి చెప్పటంతో కూతురు తోకముడిచింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని రంతమ్‌బోరే నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రంతమ్‌బోరే రిజర్వ్‌లోని జోన్ 3లో రిద్ధి అనే ఆడపులి సంవత్సరం క్రితం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అవి పెరిగి పెద్దవయ్యాయి. మంగళవారం రిద్ధి తన భూభాగంలో సేద తీరుతూ ఉంది. ఇంతలో కూతురు మీరా అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే భూభాగం కోసం తల్లితో గొడవ పెట్టుకుంది. రెండూ భీకరంగా గొడవపడ్డాయి. అయితే, గొడవ ఎక్కువ సేపు జరగలేదు. తల్లి దెబ్బకు మీరా వెనక్కు తగ్గింది. సైలెంట్‌గా అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఈ గొడవలో రెండింటికి గాయాలు అయ్యాయి. అటవీ అధికారులు కూడా ఆ గొడవ భూభాగం కోసమే జరిగిందని స్పష్టం చేశారు. అడవి జంతువుల్లో అది సహజ సిద్ధమైన ప్రవర్తన అని అన్నారు. పిల్లలు పెరిగి పెద్దవైన తర్వాత తమ సొంత భూభాగం కోరుకుంటాయని తెలిపారు. సొంత భూభాగం కోరుకునే పిల్ల పులులు మొదటగా తల్లితోటే యుద్ధం చేయాల్సి వస్తుందని అన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో జంగిల్ సఫారీకి వచ్చిన ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. హీరో, టీవీకే అధినేత విజయ్‌కు ప్రాణహాని