Navi Mumbai Local Horror: రైలులో భయానక సంఘటన.. అలజడి సృష్టించిన మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి
ABN , Publish Date - Dec 22 , 2025 | 03:23 PM
అక్తర్.. శ్వేతను ట్రైన్‌నుంచి కిందకు తోసేశాడు. తోటి ప్రయాణీకులు వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన స్పందించిన రైల్వే పోలీసులు శ్వేత కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి రైలులో అలజడి సృష్టించాడు. లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఆ వ్యక్తి మహిళలతో గొడవపెట్టుకున్నాడు. ఓ యువతిని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శ్వేత మహాదిక్ అనే యువతి డిసెంబర్ 18వ తేదీ(గురువారం)న ఖార్‌ఘర్‌లో ఉన్న కాలేజీకి వెళ్లడానికి ఉదయం 8 గంటల ప్రాంతంలో పన్వేల్ టు సీఎస్ఎమ్‌టీ వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత షేక్ అక్తర్ నవాజ్ అనే వ్యక్తి లేడీస్ కోచ్‌లోకి వచ్చాడు.
ఇది గమనించిన మహిళలు అతడిని అడ్డుకున్నారు. కిందకు దిగమని చెప్పారు. అతడు వారి మాటలు వినలేదు. వారితో గొడవ పెట్టుకున్నాడు. వారిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. మహిళలపై దాడి చేయటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో అక్తర్.. శ్వేతను ట్రైన్‌నుంచి కిందకు తోసేశాడు. తోటి ప్రయాణీకులు వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన స్పందించిన రైల్వే పోలీసులు శ్వేత కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే, పన్వెల్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్‌పై శ్వేత పడిపోయి ఉండటం స్థానికులు చూశారు. పోలీసులు అక్కడికి రాకముందే స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఖందేశ్వర్ పోలీసులు అక్తర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అతడిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం అక్తర్‌ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. పోలీసులు డిసెంబర్ 19వ తేదీన అక్తర్‌ను పన్వెల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
ఇవి కూడా చదవండి
కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎం రేవంత్‌కు తెలుసు: మంత్రి సీతక్క
జట్టు ఎంపిక అద్భుతం.. గిల్‌ను తొలగిస్తారని అస్సలు ఊహించలేదు.. భారత మాజీ కెప్టెన్